ఇంగ్లీష్‌ విూడియం.. అమలు నిర్ణయం చారిత్రాత్మకం

 

– జగన్‌ నిర్ణయంతో పేదపిల్లల భవిష్యత్తే మారుతుంది

– వ్యతిరేకిస్తే బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్కసీటూ రాదు

– ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య

విజయవాడ, నవంబర్‌27(జనం సాక్షి) : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ సీనియర్‌ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం ప్రవేశపెట్టాలని సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్‌ విూడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్‌ విూడియంను కార్పొరేట్‌ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్‌ గురించి మాట్లాడుతున్నారని ఐలయ్య మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.