ఇంటగెలిచి రచ్చ గెలవాలి
ప్రస్తుతానికి కెసిఆర్ వ్యూహం ఇదే
ముందు తెలంగాణ ఎన్నికల్లో విజయం తక్షణ లక్ష్యం
తరవాతే జాతీయరాజకీయాలపై దృష్టి
చంద్రబాబు కూటమి యత్నంపై మౌనమే సమాధానం?
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): జాతీయ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఎన్నికలలో విజయం సాధించడంపైనే టిఆర్‌ఎస్ కెసిఆర్ దృష్టి కేంద్రీకరించారు. మోడీ వ్యతిరేక కూటమి బలపడుతున్న దశలో ఆయన తగంలో ప్రకటించిన ఫోర్త్ ఫ్రంట్పై ఇప్పుడు మాట్లాడడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి జాతీయ రాజకీయాలలో ఏ పాత్ర పోషించాలన్నది అప్పుడే నిర్ణయించుకో
వచ్చునన్నది కేసీఆర్ వ్యూహంగా ఉండొచ్చు. ఇంటగెలిచి రచ్చగెలవాన్న రీతిలో కెసిఆర్ ప్రస్తుతం తాను కోరుకున్న ఎన్నికల్లో తను కోరుకున్నట్లుగా విజయం సాధించి వంద సీట్లను కైవసం చేసుకోవడంపైనే దృష్టి పెట్టారు. భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తే తన స్థానం సుస్థిరం అవుతుంది. తెలంగాణలో ఇక తనకు తిరుగు ఉండదు. అధికారంలో ఉంటే ఎంపి ఎన్నికల్లో కూడా తిరుగలేని విజయం సాధించవచ్చు. అప్పుడు జాతీయ రాజకీయాలలో కూడా తన పరపతి పెరుగుతుంది. తనకున్న సీట్లను బట్టి అప్పటి రాజకీయాలకు అనగుణంగా తన డిమాండ్ పెరుగుతందన్నది కెసిఆర్ రాజకీయ వ్యూహంగా ఉంది. చంద్రబాబు కంటే పైచేయి అవుతుందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ చంద్రబాబు చేస్తున్న హడావిడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిని నిశితంగా గమనిస్తూనే ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణలో ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్ కలిసి పోటీ చేస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి దక్కదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లోక్‌సభ ఎన్నికలలో దాని ప్రభావం పడి బీజేపీ బలం మరింత క్షీణిస్తుందన్నది చంద్రబాబు అంచనాగా ఉంది. ఈ కారణంగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణలో మహా కూటమిని అధికారంలోకి తీసుకురాగలిగితే బహుముఖ ప్రయోజనాలు చేకూరతాయని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల నేపథ్యంలో కూటమిని గెలిపించుకోవడానికి పన్నిన వ్యూహం ఫలించి తెలంగాణలో విజయం సాధించ గలిగితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైన కూడా పడుతుందనీ, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం ఏకపక్షం అవుతుందనీ చంద్రబాబు భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం కెసిఆర్‌కు కూడా బాగా తెలుసు. అయాన గతంలో కన్నా రాటుదేలారు. ఎప్పుడు ఎలా అడుగు వేయాలో నేర్చుకున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల ఫళితాలు వెలువడ్డ తరవాతనే ఆయన తన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.