ఇంటర్‌ బోర్డు ప్రక్షాళన చర్యలు


ఆర్భాటపు ప్రచారాలకు ఇక చెక్‌
విజయవాడ,నవంబర్‌8 (జనం సాక్షి) : కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఆగడాలకు చెక్‌ పెడుతూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థల్లో రుసుము నియంత్రించాలని, ఒకే రుసుము విధానం తీసుకురావాలని ఇంటర్‌ బోర్డు సమావేశంలో తీర్మానించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి కళాశాల తప్పనిసరిగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని, వివిధ క్రీడల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాల్సిందేనని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఆయా ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్దేశిరచిన రుసుము మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా ఆ విద్యాసంస్థ అనుమతి రద్దు చేస్తామని హెచ్చరిస్తూ ఇప్పటికే అన్ని కళాశాలలకు ఆదేశాలు పంపించేశారు. దీనికి సంబంధించి విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుము వివరాలు తెలిపే రశీదులను ఇంటర్‌ బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశిత రుసుము కంటే అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఆయా విద్యాసంస్థలకు ముందుగా నోటీసులు జారీచేసి అనంతరం జరిమానా విధించనున్నారు. జరిమానాలు తరువాతకూడా అదే పద్ధతి కొనసాగితే గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కో విద్యార్థికి రెండేళ్లకు కలిపి రూ.5వేలు రుసుము ఉండగా, ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో రూ.50వేల నుంచి రూ.1.50లక్ష వరకు పిండుతున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌ తదితర శిక్షణ పేరుతో విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అందడంతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. ఇంటర్‌ తరగతులు కాకుండా ఇతర శిక్షణ తరగతులు నిర్వహిస్తే రూ.50వేలు జరిమానా విధించనున్నారు. ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌ తదితర ప్రచారాలకు తెరదించుతూ ఇంటర్‌బోర్డు సమూల మార్పులు చేపట్టింది. ఫలితాలు విడుదలైతే వెంటనే ప్రసార మాథ్యమాల్లో, ప్లెక్సీలు, బ్యానర్లతో చేపడుతున్న ఆర్భాట ప్రచారాన్ని ఇకపై అనుమతించేది లేదని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం నిర్దేశిరచిన నమూనాలోనే కళాశాలల ఎదుట బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ మేరకు ఆయా కళాశాలలు వెంటనే బోర్డులు మార్చకుంటే రూ.10వేలు జరిమానాలు విధిస్తామని తెలిపారు. దీంతో ఇప్పటికే అధికశాతం కళాశాలలు బోర్డులు మార్చుకోగా మిగిలిన కళాశాలలు కూడా బోర్డులు మార్చే పనిలో ఉన్నాయి.  ప్రభుత్వం చేపట్టిన ఈ సమూల మార్పులతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఇంటర్‌బోర్డు మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. బోర్డు అధికారులు జిల్లాలో రోజుకు
రెండు, మూడు కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల నిర్వహణకు 11వేల చదరపు అడుగులు, నాలుగు పాఠ్యాంశాలకు సంబంధించి ప్రయోగశాలల నిర్వహణకు 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ఉండాలి. క్రీడామైదానం కచ్చితంగా ఉండాలి. బోర్డు అనుమతి ఉంటేనే వసతి గృహాలు నిర్వహించాలి. అనుమతి లేకుండా వసతిగృహాలు నిర్వహించినా, బోర్డు సూచించిన స్థలంతో కళాశాలలు లేకపోయినా చర్యలు తప్పవు. ఇప్పటికే విద్యాసంవత్సరం సగం పూర్తవడంతో నిబంధనలు పాటించని కళాశాలల జాబితాను సిద్ధంచేసి వచ్చే విద్యాసంవత్సరం వీటిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.