ఇంటింటికీ నీరు చేరేలా చూడాలి

చెత్త డంపింగ్‌ యార్డులకు తరలాలి

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం చూపకుండా పకడ్బందీగా చేయాలనీ కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. లక్ష్యం మేరకు పనుఉల పూర్తి చేసి ముందుకు సాగాలన్నారు. 30రోజుల ప్రణాళికలో చేపట్టిన పనుల పురోగతిపై మాట్లాడుతూ మంకీ ఫుడ్‌ కోట్‌, రోడ్‌ సైడ్‌ ప్లాంటేషన్‌, 85శాతం మొక్కలను బతికించుకోవాలనీ, వాటిలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీగార్డులు, వాటరింగ్‌ సరిగా ఉన్నాయా? లేదా పరిశీలించాలన్నారు. ప్రతి గ్రామంలో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు, మొక్కలకు నీటిని పోసేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో అమలయ్యేలా మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ గ్రామంలోనైతే పనులు జరగడం లేదో వాటిని గుర్తించి పంచాయతీ చట్టంలో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న మిషన్‌ భగీరథ పనులపై కలెక్టర్‌ ఇటీవల అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో వార్డుల వారీగా ఇంటింటికీ కనెక్షన్‌ ఇచ్చి కాంక్రీట్‌ ప్లాట్‌ఫారం నిర్మించాలన్నారు. దీనికి సంబంధించి ఇంటి యజమాని, సంబంధిత వార్డుమెంబర్లతో కనెక్షన్‌ ఇచ్చినట్లుగా ధృవీకరణ చేసుకోవాలన్నారు. అలాగే సంబంధిత సర్పంచ్‌, సెక్రటరీ, మండల పంచాయతీ అధికారులతో సంతకాలు తీసుకోవాలన్నారు. ఇంటింటి కనెక్షన్లు గ్రామ పంచాయతీ వార్డుల వారీగా నివేదికపై మండల పంచాయతీ అధికారి, కాంట్రాక్టర్లతో కూడిన ధృవీకరణ సంతకాలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామంలోని పాత ట్యాంకులకు ఏమైనా రిపేర్లు, రంగులు వేయాల్సి ఉంటే వాటిని 14వ ఫైనాన్స్‌ నిధుల నుంచి ఖర్చు చేయాలని మండల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాం ట్రాక్టర్లు పనులు చేయపోతే వారిని తొలగించడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు సిఫారసు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ నీటి సరఫరా ఆపరేటర్లను మిషన్‌ భగీరథ వారు ఉపయోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మండల పంచాయతీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.