ఇంటి అనుమతి చార్జీల వడ్డన
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో భవన నిర్మాణ అనుమతుల చార్జీలను అడ్డగోలుగా పెంచింది. సామాన్యుల నడ్డివిరిచేలా ప్రస్తుతం ఉన్న రేట్లపై 50 నుంచి 150 శాతం వరకు పెంచుతూ జీవో జారీ చేసింది. నగరపాలక సంస్థ పరిధిలో స్థలం కొనుగోలు చేసేందుకే కుదేలవుతున్న సామాన్యులు ఇక ఇంటి పర్మిషన్లకూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇంటి అనుమతుల చార్జీల పెంచి లాభాలను గడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్‌ఆర్‌ఎస్ కాలపరిమితి ముగిశాక కార్పొరేషన్లకు ఆదాయం తగ్గింది. ఆ మేరకు లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతుల చార్జీల పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త చార్జీలు అమలు చేయాలని కార్పొరేషన్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఓవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం, మరోవైపు ఇంటి అనుమతుల చార్జీలు పెంచడంతో సామాన్యునికి సొంతిల్లు కలగా మిగిలే పరిస్థితులు తలెత్తాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే విషయం ముందే ప్రకటించిన ప్రభుత్వం ఇంటి అనుమతుల చార్జీలు పెంచే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ నెల 18నే గెజిల్ తయారు చేసిన మున్సిపల్ శాఖ సంబంధిత అధికారులకు శనివారం అందజేసింది. దీంతో అనుమతుల కోసం ఎదిరిచూస్తున్న వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటన్నింటికి కొత్త రేట్లు వర్తించనున్నాయి. విషయం ముందే తెలిస్తే తమ పనులు మార్చిలోనే పూర్తిచేసుకునే వారమని దరఖాస్తుదారుల వాపోతున్నారు.