శ్రీనగర్(జనం సాక్షి ): ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు జమ్ముకశ్మీర్ సీఎం మొహబూబా ముఫ్తీ. 70 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి కొరియాలు చేతులు కలిపాయని, ఇండియా-పాకిస్థాన్ ఎందుకు ఆ పని చేయకూడదని ఆమె ప్రశ్నించారు. శ్రీనగర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మనం స్నేహితులను మార్చవచ్చుగానీ పొరుగువాళ్లను కాదు అని వాజ్‌పేయి అన్న మాటలను మొహబూబా గుర్తుచేశారు.మా కొలీగ్ మెహబూబ్ బేగ్ చెప్పినట్లు ప్రజల కోసం 70 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి ఉత్తర, దక్షిణ కొరియాలు స్నేహితులయ్యారు. కానీ ఇక్కడ మాత్రం మన సరిహద్దుల్లో ఇంకా కాల్పుల మోత మోగుతూనే ఉంది. రెండు వైపుల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దేశాలు దగ్గరయ్యే వరకు ఈ పరిస్థితిలో మార్పు రాదు అని ముఫ్తీ అన్నారు. జమ్ముకశ్మీర్ పరిస్థితి చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలుఎలా ఉన్నాయో తెలుస్తుందని, అందుకే తాము చర్చలు కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య సమావేశం జరిగినా కూడా రక్తపాతం ఆగకపోవడం దురదృష్టకరమని మెహబూబా వ్యాఖ్యానించారు.