ఇండోనేసియాలో మరో ఆత్మాహుతి దాడి


– సురబయా పోలీసు కార్యాలయంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు

సురబయా, మే14(జ‌నం సాక్షి) : ఆదివారం నాడు మూడు చర్చ్‌లపై దాడి చేసి 13 మందిని బలితీసుకున్న ఉగ్రవాదులు, సోమవారం నాడు ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మూడు చర్చ్‌లపై దాడి చేసిన ఒకే కుటుంబానికి చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి తెగబడటం గమనార్హం. పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద వున్న సిసి టీవీ చిత్రాలలో ఒక కారు, రెండు మోటార్‌ సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు పోలీసు కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వున్న చెక్‌పోస్ట్‌పై ముందుగా బాంబులతో దాడి చేసిన దృశ్యాలు కన్పిస్తున్నాయి. పోలీసు అధికారులతో పాటు కొందరు పౌరులు కూడా గాయపడ్డారు. ఈ దాడిని ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ఐదుగురు సభ్యులున్న కుటుంబంలోని వారే చేసినట్లు భావిస్తున్నామని ఇండోనేసియా పోలీస్‌ చీఫ్‌ టిటో కర్నవియాన్‌ చెప్పారు. రెండో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఈ కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ వెలుపల వున్న చెక్‌పోస్ట్‌ వద్ద తమను తాము పేల్చివేసుకున్నారని ఆయన విూడియా ప్రతినిధులకు వివరించారు.