ఇందిరమ్మబాటపై మంత్రులతో సీఎం సమావేశం
వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు
హైదరాబాద్, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు వట్టి వసంతకుమార్, శత్రుచర్ల విజయరామరాజు, బస్వరాజు సారయ్య, పితాని సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, పార్ధసారధి, సబితా ఇంద్రారెడ్డి, కొండ్రు మురళి, శైలజానాధ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న ఇందిరమ్మ బాట విధి విధానాలపై చర్చించడానికై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో వైపు ఈ సమావేశానికి కొంత మంది మంత్రులను చర్చలకు ఆహ్వానించడం పట్ల పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ప్రవేశపెడుతున్న పథకాల గురించి చర్చించే సమయంలో తమకు ఆహ్వానం లేకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు, ఎరువులు, విత్తనాలు తదితర సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టే అవకాశం ఉందని కొందరు అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. అయితే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పి.. సంక్షేమ పథకాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. వారంలో ఒక్కో జిల్లాలో మూడేసి రోజుల చొప్పున అంటే బుధ, గురు, శుక్రవారం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సిఎం నిర్ణయించారు. వారంలో మిగిలిన రోజులు హైదరాబాద్ సచివాలయంలో పరిపాలన కొనసాగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ బాట విజయవంతమయ్యేందుకు మంత్రులు, స్థానిక నాయకులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.