ఇందిరమ్మ స్ఫూర్తి ప్రదాత : సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌ 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్సెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీప్‌ బొత్స సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతో పాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, మంత్రి దానం నాగేందర్‌ తదితరులు కూడా పూలమాలలువేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు రోగులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ సేవలు ఎప్పటికీ చిరస్మరణియంగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఎంతగా పాటుపడ్డారని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో అభివృద్ధి సాధ్యమని నిరూపించిన ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కిందని ఆయన అన్నారు. అంతర్జాతీయస్థాయిలో ఇందిరాగాంధీ చురుకైన పాత్రపోషించారని ఆయన కొనియడారు. జీవిత బీమా, బ్యాంకుల జాతీయకరణ తదితర అంశాలపై ఇందిరాగాంధీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇందిరాగాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగానే సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేలా కార్యకర్తలు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.