ఇందిర పేరు మారిస్తే ఖబర్దార్
కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక
బెంగళూరు,ఆగస్ట్10(జనంసాక్షి): రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్ ఇప్పటికే గుర్రుగా ఉంది. కాగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన క్యాంటీన్లకు పేరు మార్చేందుకు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమని లేచింది. ఆ క్యాంటీన్లకు ఇందిరా పేరు తొలగిస్తే సావర్కర్, దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ సైన్‌బోర్డులపై నలుపు రంగు పూస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇలాంటి పనులు మానుకొని ప్రజలు ఉపయోగపడే పనులు చేయాని కాంగ్రెస్ సూచించింది.
ఈ విషయమై మంగళవారం బెంగళూరులో నిర్వహించిన విూడియా సమావేశంలో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ ‘ఇందిరా క్యాంటీన్ల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సావర్కర్ బ్రిగేడ్, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ బ్రిగేడ్ సైన్‌బోర్టులకు నలుపు రంగు పూస్తాం. ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేసిన, పేదల కోసం అనునిత్యం శ్రమించిన ఇందిరా గాంధీ పేరు మార్పు సరికాదు. ప్రభుత్వం పేర్లు మార్చే పని మానేసి ప్రజాసేవ చేస్తే మంచిది‘ అని అన్నారు.