ఇక్కడ వీరబాదుడు.. అక్కడ నీరసం!
కోల్‌కతా : ఐపీఎల్ అంటే చాలు.. మన క్రికెటర్లకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎలా ఆడినా, ఐపీఎల్‌లో మాత్రం విజృంభించేస్తారు. ఈ విషయం పదే పదే చాలాసార్లు రుజువు అవుతూనే ఉంది. నిన్న కాక మొన్న జరిగిన ఆసియా కప్ టి20 మ్యాచ్‌లలో ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఎంత అందంగా ఆడారో అందరికీ తెలుసు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే తనకు అచ్చొచ్చిన మైదానాల్లో కూడా ఏమాత్రం మంచి ప్రదర్శనలు చూపించలేదు. కానీ బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 84 పరుగులు చేశాడు. మరి టి20 ప్రపంచకప్‌లో మాత్రం అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 88. అది కూడా చిట్టచివరి మ్యాచ్, సెమీఫైనల్లో 43 పరుగులు చేయడం వల్ల ఆ మాత్రం కనిపించింది. అంతకుముందు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా అతడి స్కోర్లు చూస్తే నీరసం రాక తప్పదు.
మొట్టమొట న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5, తర్వాత పాకిస్థాన్ మీద 10, కీలకమైన బంగ్లా మ్యాచ్‌లో 18, ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద కేవలం 12 పరుగులు.. ఇవీ రోహిత్ స్కోర్లు. ఆ సీజన్ ముగిసి కూడా ఎన్నాళ్లో కాలేదు. కానీ ఐపీఎల్ రాగానే ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందో ఏమో గానీ.. ఏకంగా 84 పరుగులు సాధించాడు! ఐపీఎల్‌లో సరిగా ఆడకపోతే తర్వాతి సీజన్‌కు తమకు వేలంలో తగినంతగా డబ్బులు రావన్న భయమో.. కెప్టెన్‌గా ఉండి కూడా ఆడకపోతే తర్వాత జట్టులోనే స్థానం కోల్పోవాల్సి వస్తుందనో ఆడి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
నిజానికి ఎవరైనా దేశానికి ప్రాతినిధ్యం వహించేటపుడు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారు. కానీ టీమిండియా క్రికెటర్లలో కొంతమంది మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదే వెస్టిండీస్‌లో అంతగా పేరులేని బ్రెత్‌వైట్ లాంటి బ్యాట్స్‌మన్ కూడా చివరి ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాది ఫలితాన్ని తలకిందులు చేస్తున్నారు. ఇప్పటికైనా మనవాళ్లు డబ్బులే కాక.. దేశం గురించి కాస్తంత పట్టించుకుంటే అభిమానులు కూడా సంతోషిస్తారు.