ఇక ఉద్యమం ఉరుముతది

మరో మిలియన్‌ మార్చ్‌కు తెలంగాణ సిద్ధం ,
తెలంగాణ మార్చ్‌ పేరన సెప్టెంబర్‌ 30న చలో హైదరాబాద్‌ ,
తెలంగాణ బిడ్డలు ఎవరి గులాంలు కారు ,
రాయల తెలంగాణకు ఒప్పుకునే ముచ్చటే లేదు ,
కాంగ్రెస్‌, టీడీపీలను ఖతం చేస్తేనే తెలంగాణ ,
విసృత సమావేశంలో భవిష్యత్‌ కార్యచరణ ప్రకటించిన కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 7 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమం ఇక ఉరుమేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మరో మిలియన్‌ మార్చ్‌లా తెలంగాణ మార్చ్‌ పేరిట సెప్టెంబర్‌ 30న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం నాచారంలోని నోమా ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. మూడు గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణను ఆయన ప్రకటిం చారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీలను నామారూపాలు లేకుండా ఖతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలంగాణ జేఏసీ తీర్మానం చేసినట్లు కోదండరాం వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ను ఏమాత్రం నమ్మడానికి లేదని, ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ నెరవేర్చలేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎలాంటి ఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌కు ఓటెయ్యకూడదని జిల్లా జేఏసీలు ప్రజలకు వివరించాలని కోదండరాం పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌, టీడీపీలు ఏ విధంగా మోసం చేశాయో విడమర్చి ప్రచారం చేయగలిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. ఆ రెండు పార్టీలు అవలం బిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి
ఆ రెండు పార్టీలను భూ స్థాపితం చేసే దిశగా తమ చర్యలు ఉండాలని అభిలషించారు. ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’గా ప్రభుత్వం గుర్తించాలని కోదండారాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకే వంద శాతం ఉపాధి అందేలా చూడాలని కోరారు. మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేలా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాయల తెలంగాణకు జేఏసీ తీవ్ర వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోవాలని కోదండారాం తెలంగాణ నాయకులకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణవాదాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్‌ కార్యాచరణ
శనివారం జేఏసీ సమావేశం అనంతరం చైర్మన్‌ కోదండరాం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు. జూలై 20 వరకు జిల్లా జేఏసీలతో విస్తతృ సమావేశాలు నిర్వహించాలను జేఏసీ ముఖ్య సభ్యులను కోరారు. ఆగస్టు 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారాలు, ఆందోళనలు చేపట్టాలని జిల్లా జేఏసీలను కోరారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా తమ కార్యాచరణ ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని నాయకులను ప్రత్యక్ష ఉత్యమంలో పాల్గొనేలా జిల్లా వారీగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 30న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, దీనికి తెలంగాణవాదులు, తెలంగాన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై పాలకులకు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.