ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. గుర్రం బండి ఎక్కి గ్రామ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకే తమ ఓటు అంటూ మంత్రికి పలువురు ఏక్రగీవ తీర్మాన కాపీలను కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం గ్రామానికి వచ్చిన తనకు ఏకగ్రీవ తీర్మానం అందించి గ్రామం చిన్నదైనా.. గ్రామస్తులది పెద్ద మనసు అని నిరూపించుకున్నారన్నారు. రాంపూర్‌ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసిన మద్దతు తెలుపడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడోసారి సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రామం రాంపూర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత రాంపూర్‌లో యాసంగి పంట 18 లారీల ధాన్యం పండించారన్నారు.

మూడు గంటల కరెంటు చాలంటున్న వారు తెలివితో మాట్లాడుతున్నారా? లేదా? ప్రజలే ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తప్పాయని, గతంలో ఎండాకాలం వచ్చిందంటే రాంపూర్ గ్రామంలో బోరు బండ్ల మోత మోగేదని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలు పరుస్తూ అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు వర్షాలు రాక కప్పతల్లి ఆట ఆడేవారని, ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా చెరువులు కాలువల్లో నీటిని సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ ఉందని తెలిపారు. రైతు అర్ధాంతరంగా చనిపోతే రూ.5లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కుటుంబానికి పెద్దన్నలా నిలుస్తున్నాడన్నారు. రాంపూర్‌ గ్రామానికి ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన రఘోత్తం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కడుపులో పడ్డ బిడ్డనుంచి అందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

సిద్దిపేటలో అన్ని రకాల విద్య..

చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల విద్యలను సిద్దిపేటలోనే అందిస్తున్నామన్నారు. గ్రామంలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 42 మందికి సాంక్షన్ వచ్చిందని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే వారికి కూడా తర్వాత ఫేజ్‌లో అందిస్తామని హామీ ఇచ్చారు. అంజన్న గుడికి నా వంతు సహాయం ఇస్తానని, మంచిరోజు చూసి పని ప్రారంభించుకోవచ్చన్నారు. నెలరోజుల్లో రుణమాఫీ పూర్తిగా అయిపోతుందని, గతంలో ఏడు ఓట్లు తప్ప మిగతా బీఆర్ఎస్‌కే పడ్డాయని, ఇప్పుడు ఏడు కూడా పోకుండా చూడాలన్నారు.