ఇది ఆకలి కేకల పోరాటం
సింహకంఠ నాదంతో గర్జిస్తాం
తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబిస్తాం : కోదండరాం
‘మార్చ్ ‘కు హోరెత్తుతున్న సన్నాహక ర్యాలీ
హైదరాబాద్/నిజామాబాద్, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) :
తెలంగాణ మార్చ్ విహార యాత్ర కాదు, ఆకలి కేకల యాత్ర అని కోదండరాం పేర్కొన్నారు. 30న
ట్యాంక్ బండ్‌పై సింహకంఠనాదంతో గర్జిస్తామని ఆవేశంగా అన్నారు. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో ఆయన పై విధంగా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీల్లో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 30న నిర్వహించే మార్చ్‌కు ఇంటికో మనిషి, చేతికో జెండాతో తరలిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. 30న ఎవరికి వారు హైదరాబాద్‌కు చేరుకుని ర్యాలీలో పాల్గొనాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని ఆయన కొనియాడారు. తుది శ్వాస వరకు బాపూజీ తెలంగాణ కోసం తపించారని, ఆ కోరిక తీరకముందే ఆయన మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలంటే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం
చేసి, మన ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్పాల్సిన అవసరమున్నదని స్పష్టం చేశారు. మార్చ్ నిర్వహణలో ఎలాంటి గందరగోళం లేదని, తప్పకుండా మార్చ్ శాంతియుతంగానే జరుగుతుందని వివరించారు. కొందరు కావాలనే అల్లర్లు జరుగుతాయని పుకార్లు సృష్టిస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించాలని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సత్యాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ వచ్చే వరకు ఢిల్లీలో చర్చలు, గల్లీలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే మార్చ్‌కు అనుమతి కోసం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుస్తామని కోదండరాం వెల్లడించారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా మార్చ్ నిర్వహించే తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం చేతగాని దానిలా శాంతి భద్రతల సమస్యలను కావాలనే లేవనెత్తుతున్నదని ఆయన మండిపడ్డారు. ఆయా చోట్ల నిర్వహిస్తున్న సన్నాహక మార్చ్‌ల్లోనే వేల మంది ప్రజలు పాల్గొంటున్నారని, అలాంటిది ట్యాంక్ బండ్‌పైకి జనం లక్షలాదిగా తరలి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని, అదే జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కోదండరాం నొక్కి చెప్పారు. సికింద్రాబాద్‌లో జరిగిన మార్చ్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ శాసన సభ పక్ష ఉప నేత హరీష్‌రావు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.