ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌
కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ తనను పోటీలో నిలువకుండా టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందన్నారు. ఇక్కడ గంగుల కమలాకర్‌ మంత్రిలా వ్యవహరించలేదని విమర్శించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఈసీకి ఇచ్చానన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ది విజయం కాదని… తన విజయమని రవీందర్‌ సింగ్‌ అన్నారు. ఎందుకంటే.. తన నామినేషన్‌ ఫారమ్‌ను తిరస్కరించే ప్రయత్నం చేశారని.. అయినా తాను పోటీలో ఉన్నానని ఇది తన మొదటి విజయమన్నారు. తాను విత్‌ డ్రా కాకపోవడం రెండో విజయమన్నారు. 11 వందల మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు 18 రోజులు భోజనం, అన్నిరకాల వసతులు కల్పించానని, ఇంకొక గొప్ప విజయం ఏంటంటే.. ఎలా ఓటు వేస్తారన్నది ఎంపీటీసీలకు తన ద్వారా తెలిసిందని.. ఇవన్నీ తన విజయాలేనని రవీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కేవలం 103 ఓట్లు వస్తాయని అనుకంటే 200 పైగా ఓట్లు సాధించామని అన్నారు. ఇది తనకు అతిపెద్ద విజయమన్నారు. క్యాంపులు పెట్టకుంటే టిఆర్‌ఎస్‌ బలిమేమిటో తెలిసేదన్నారు.