ఇది రిటైర్మెంటే.. రాజకీయాలకు కాదు

– గల్లా జయదేవ్‌
విజయవాడ, జూన్‌27(జ‌నం సాక్షి) : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న ఆమె ఆ పదవి నుంచి తనను తప్పించాలని సీఎం చంద్రబాబును ఇంతకు ముందు కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా చంద్రబాబుకు ఆమె తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం చంద్రబాబు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఆమెను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా నియమిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు. నేపథ్యంలో తన తల్లి రిటైర్మెంట్‌ గురించి గల్లా జయదేవ్‌ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన తన తల్లి ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రమే రిటైర్మెంట్‌ ప్రకటించారని, రాజకీయాలకు కాదని జయదేవ్‌ ట్వీట్‌ చేశారు. 30 ఏళ్ల ఆమె అనుభవం పొలిట్‌ బ్యూరో ద్వారా పార్టీకి ఉపయోగపడుతుందని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.