ఇదెక్కడి (అ)న్యాయం?
– టి.రమేష్‌బాబు, కరస్పాండెంట్
న్యాయదేవత సాక్షిగా న్యాయమూర్తుల పైనే వేటు పడింది. బాధితులకు న్యాయం చెప్పి బాసటగా నిలవాల్సిన ప్రతినిధులే బాధితులుగా మారిపోయిన అరుదైన సందర్భం తెలంగాణలో చోటు చేసుకుంది. ఆదివారం నాటి నిరసనల్ని క్రమశిక్షణ రహితంగా భావించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బి. బొసాలే సోమవారం ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై జడ్జీలు ఆందోళనను తీవ్రం చేయడంతో మంగళవారం మరో తొమ్మిది మందిని బొసాలే సస్పెండ్ చేశారు. ఈ చర్యతో తెలంగాణవ్యాప్తంగా న్యాయమూర్తులు, న్యాయాధికారులు, ఇతర కోర్టు సిబ్బంది ఆందోళనను ఉధృతం చేశారు. ఇప్పటివరకూ న్యాయవాదులకే పరిమితమైన విభజన డిమాండ్ కు న్యాయమూర్తులు కూడా తోడవడంతో ఈ అంశం సంచలనాత్మకంగా మారింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా న్యాయమూర్తులు, ఇతర సిబ్బందిని తెలంగాణలో కేటాయించడం వివాదానికి కారణమైంది. ఆదివారం నాటి ఆందోళనలు, సోమవారం నాటి క్రమశిక్షణా చర్యలు, వాటికి ప్రతిగా మంగళవారం కొనసాగిన నిరసనల్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్రమైన విషయంగా పరిగణించడంతో మరో 9 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో వీరి సంఖ్య 11కు చేరింది. హైకోర్టు విభజన కోసం న్యాయవాదుల ఆందోళనకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలపై తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె. రవీందర్ రెడ్డి, వి. వరప్రసాద్ ల వివరణ కోరిన బొసాలే వారి వివరణలతో సంతృప్తి చెందకపోవడంతో సస్పెండ్ చేశారు. దాన్ని ఎత్తేయాలంటూ న్యాయవాదులు, తెలంగాణలోని అన్ని కోర్టుల జడ్జీలు, ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో తెలంగాణలోని అన్ని కోర్టుల్లోనూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. హైదారాబాద్ లో, జిల్లా కేంద్రాల్లో న్యాయవాదులు, జడ్జిలు, కోర్టు సిబ్బంది ఆందోళనను ఉధృతం చేయడంతో వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. తమ సహచరులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న డిమాండ్ తో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన న్యాయాధికారులు మరోసారి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవాలని తీర్మానించారు. న్యాయవాదుల ఆందోళనలు, కోర్టు సిబ్బంది పెన్‌డౌన్‌తో సహాయ నిరాకరణ కార్యక్రమాలు, మరోవైపు న్యాయాధికారుల సామూహిక సెలవులతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెలంగాణవ్యాప్తంగా కోర్టులన్నీ మూగబోయాయి. మరోవైపు 15 రోజులపాటు సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించారు. సస్పెన్షన్‌కు గురైన జడ్జిలకు మద్దతుగా 200 మంది న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవులపై వెళ్లాలన్న నిర్ణయానికొచ్చారు. ఇక జులై 1 నుంచి న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కనీసం న్యాయస్థానాల తాళాలు తెరిచే పరిస్థితి కూడా ఉండదంటున్నారు. న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్న ఈ 22 రోజుల్లో దాదాపుగా కేసులు విచారణకే నోచుకోలేదంటే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.న్యాయమూర్తుల డిమాండ్ ను సామరస్యంగా పరిష్కరించాలని పలు పార్టీల ప్రతినిధులు సూచించడం.. ఈ వివాదంలోని సున్నితత్వాన్ని తెలియజేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కోర్టు సిబ్బంది, న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళనలు, తదనంతర పరిణామాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ ఎంపీలతో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు. విషయం ముదురుపాకాన పడకముందే వీలైనంత త్వరగా హైకోర్టు విభజనతో పాటు న్యాయాధికారుల సస్పెన్షన్ ఎత్తివేతపై సానుకూలంగా స్పందించాలని విజ్నప్తి చేశారు.
కేసీఆర్ ప్రకటనతో కమలనాథుల్లో కలకలం
ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోది అయినందున, రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయినా మోడీ సర్కారు హైకోర్టు విభజనను పట్టించుకోవడం లేదని, ఇందులో కొందరు ఆంధ్రా నాయకుల కుట్రే కారణమని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రాన్ని బాధ్యురాల్ని చేస్తూ ఢిల్లీలో ఆందోళనకు దిగుతామని కేసీఆర్ వ్యాఖ్యానించడం ఢిల్లీ పెద్దల్లో కలకలం రేపుతోంది. కేంద్ర సర్కారుపై కేసీఆర్ విమర్శలు ఆశ్చర్యాన్ని కలిగించాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు. ఆయనతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిసినప్పుడు హైకోర్టు విభజన అంశం ఉమ్మడి హైకోర్టులో ఉన్నందున తానేవిూ వ్యాఖ్యానించలేనని, ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్రా లేదని సదానందగౌడ చెప్పడం కేంద్రం వైఖరిని తెలియజేస్తోందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుదేనన్నారు. హైదరాబాద్‌లోని పరిణామాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రెండు రాష్ట్రాల గవర్నర్లకు లేఖ రాస్తానని ముక్తసరిగా చెప్పడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు తెలంగాణ న్యాయవాదులు.
ఆచితూచి స్పందిస్తున్న కాంగ్రెస్
హైకోర్టు విభజన అంశంలో కాంగ్రెస్ ఇరుకున పడ్డట్టయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదించింది కాంగ్రెస్సే అయినందున తాజాగా తలెత్తిన కోర్టు సిబ్బంది ఆందోళనను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయిలో సమర్థించలేకపోతున్నారు. ఆచితూచి స్పందిస్తూ కేంద్రం విూద తీవ్రస్థాయిలో విమర్శించలేని వైఖరిని అవలంబిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆందోళనను కేసీఆర్ ను మాత్రం టార్గెట్ చేసే అవకాశంగా మలచుకునే ఎత్తుగడను అవలంబిస్తుండడం విశేషం. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని వారంటున్నారు. ప్రతిపక్షాలను బలహీనపరచడం కాదు… ఇలాంటి సమయాల్లో కలుపుకొనిపోవాలని పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. సీఎల్పీ నేత జానారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. జడ్జీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తప్పుపడుతూనే కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.