ఇద్దరే దోషులు!
– జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడి
– అనీక్, ఇస్మాయిల్‌లను దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి
– మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
– దోషులకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు
హైదరాబాద్, సెప్టెంబర్4(జనం సాక్షి) : గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును మంగళవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వెల్లడి చేశారు. ఈ జంట పేలుళ్ల కేసులో అరెస్టు అయిన ఐదుగురు ఉగ్రవాదులు చర్లపల్లి జైలులో ఉంటున్నారు. వీరిలో ఇద్దరిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. అనీఖ్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లను దోషులుగా, ఫరూఖ్ షఫ్రుద్దీన్, సాధిక్ ఇసార్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నిందితులకు ఆశ్రయం కల్పించిన కేసులో అంజుమ్ పై తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. ఇద్దరు నిర్దోషులకు ఈ నెల 10న శిక్షలు ఖరారు చేయడంతో పాటు అంజుమ్ పై తీర్పును న్యాయమూర్తి ప్రకటించనున్నారు.
పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్ల విధ్వంసం కేసులో ఎన్‌ఐఏ న్యాయస్థానం
మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇద్దరిని దోషులుగా నిర్థారించిన న్యాయమూర్తి.. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్‌ఛాట్‌లో విద్రోహ శక్తులు బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో 44 మంది మృతిచెందగా 68మంది పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ బృందం తేల్చింది. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ సహా పలువురిని నిందితులుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో అరెస్టయిన ఐదుగురు చర్లపల్లి కారాగారంలో ఉన్నారు. 11 ఏళ్లపాటు సుధీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణ తుది వాదనలు ఈ ఏడాది ఆగస్టు 7న ముగిశాయి. ఆగస్టు 27న తుది తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. కానీ న్యాయమూర్తి తీర్పును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు. సోమవారం ఇద్దరిని దోషులుగా తేల్చుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శిక్షను సోమవారానికి వాయిదా వేశారు.



