ఇనుప సామాన్ల షాపులో పేలుడు

– ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

– సూర్యాపేట అయ్యప్ప ఆలయం సవిూపంలో ఘటన

సూర్యాపేట, సెప్టెంబర్‌13((జనంసాక్షి): పాత ఇనుప సామాన్లు దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు మృతిచెండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం సవిూపంలో గల ఇనుప సామాన్ల షాపులో శుక్రవారం సంభవించింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షాపులో పనిచేస్తున్న సాహు అనేక కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు సల్మాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కన్నుకు తీవ్రగాయమైనట్టు వైద్యులు తెలిపారు. వీరిద్దరినీ మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం అక్కడ నుంచి వచ్చిన యువకులు, ఇనుప సామాన్ల షాపులో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు.