ఇనుము వేడిగా ఉంది..సులువుగా వంచొచ్చు
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆకాంక్ష ఏమిటో, నాలుగు కోట్ల మంది ఏ లక్ష్యం కోసం ఎప్పుడైనా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారో యావత్ దేశానికి తెలుసు. ప్రపంచమంతా తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ వ్యక్తీకరణను చూసి ‘ఔరా!’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నది. కానీ, కేవలం తెలంగాణ ప్రజాప్రతినిధులు మాత్రమే ఇక్కడి ప్రజల ఆకాంక్షను తమ ప్రయోజనాలకు, తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడు తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించే సమయం వచ్చినా, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారనేది ప్రజలు నమ్ముతున్న నిజం. గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా తెలంగాణ ప్రజాప్రతినిధులు చేజేతులా విడుచుకున్నారు. జనం మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మరో సువర్ణావకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. ఈసారైనా టీ ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం కదిలేలా చేయాలని యావత్ తెలంగాణ కోరుకుంటున్నది. కానీ, కొందరు ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికను తెలంగాణకు అనుకూలంగా వినియోగించుకోవచ్చనే ఆలోచన కూడా నిమ్మకు నీరెత్తని చందంగా వ్యవహరిస్తున్నారు. అది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఉద్యమ పార్టీగా చెప్పే టీఆర్‌ఎస్ కావచ్చు. టీఆర్‌ఎస్ అయితే ఓ అడుగు ముందుకేసి మరో రెండు నెలల్లో ఏర్పాటు కానుందని ప్రకటనలు చేస్తున్నది. ఈ రెండు నెలలు గడిస్తే వచ్చిన పుణ్య కాలం కాస్తా దాటి పోతుంది. అంటే, రాష్ట్రపతి ఎన్నిక అయిపోతుంది. అదే జరిగితే గతం పునరావృతం కాకమానదు. అప్పుడు మళ్లీ కథంతా మొదటికొస్తుంది. ఇంతకు ముందు ఇదే జరిగింది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తిరుగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అప్పుడు మెజార్టీ కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని సర్కార్ వెతుకులాట ప్రారంభించింది. ఈ సమయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు సంఘటితమైతే అప్పుడే తెలంగాణ అనుకూల ప్రకటన వచ్చేదేమో ! కానీ, అలా జరుగలేదు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కిరణ్ సర్కార్‌కు మద్దతిచ్చారు. అప్పుడు సోనియా మెప్పు కోసం వెంపర్లాడారే గానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారు. కానీ, అదే సమయంలో కాంగ్రెస్ సర్కార్‌ను గట్టెక్కించేందుకు ఎంఐఎం, పీఆర్పీ సరిగ్గా వాడుకున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చుకున్నాయి. అదే పరిస్థితి పునరావృతం కాకూడదని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలతీతంగా వాడుకొని, తెలంగాణ అంశంపైనే ఎన్నిక జరిగేలా ఉద్యమించాలని కోరుతున్నారు. ఈ దిశగా తమ తమ అధిష్టానాల నుంచి స్పష్టమైన హామీలు తీసుకోవాలని, అలా ఇస్తేనే ఓటేయాలని, లేకుంటే ఎన్నికను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జేఏసీ కూడా ఇదే కోరుతూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేఖ రాసింది. తెలంగాణ జేఏసీ రాజకీయేతర శక్తి. తెలంగాణ ప్రజల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం మేధావుల నేతృత్వంలో ఆవిర్భవించిన రాజకీయ జేఏసీ. ఇది కూడా రాష్ట్రపతి ఎన్నికను ఆయుధంగా వాడుకోవాలని ఇక్కడి ప్రజాప్రతినిధులను కోరుతున్నదంటే, ఈ ఎన్నిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జరిగేలా చూసే బాధ్యత ముమ్మాటికీ తెలంగాణ ప్రజాప్రతినిధులదే. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంగుతుందన్న నిజాన్ని ఇప్పటికైనా తెలంగాణ
ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలి. సంఘటితంగా ఆ ‘ఇనుము’ను వంచాలి. ఇరుసును తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాలి.