ఇన్‌పుట్ సబ్సీడీ రైతులకందించని వ్యవసాయ అధికారులపై చర్యలు – జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు
మెదక్,జూలై 18: ఇన్‌పుట్ సబ్సీడి రైతులకు అందించని వ్యవసాయశాఖ అధికారులపై శాఖపరమన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. బుధవారంనాడు స్థానిక తెలంగాణ భవన్‌లో జరిగిన మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజలందరికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు రెవెన్యూ డివిజినల్ స్థాయి అధికారులను ఆదేశించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతుల బ్యాంక్ ఖాతాలో ఇన్‌పుట్ సబ్సీడి జమ అయ్యేవిధంగా చూడాలన్నారు. ఖాతాలు తెరవని రైతులకు 3 రోజులలో వారి ఖాతాలను తెరిపించి డబ్బులు జమచేయాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను సకాలంలో రైతులకు అందించేందుకు గాను తహశిల్దార్‌లు, ఎ.ఓలు ఆదర్శరైతుల సహకారం తీసుకోవాలన్నారు. మెదక్ డివిజన్‌కు 3636 టన్నుల ఎరువులు సరఫరా అవుతాయని తెలిపారు.డిమాండ్‌కి మించి ఎరువులను దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ వ్యవసాయశాఖ అధికారిని ఉమామహేశ్వరిని ఆదేశించారు. ఎరువుల పంపిణీలో తహశిల్దార్‌లు , వ్యవసాయశాఖ అధికారుల సమక్షంలో పంపిణీ చేసి రిజిష్టర్‌లలో ఇద్దరు సంతకాలు తప్పనిసరిగా చేయాలన్నారు. ఎరువుల డీలర్‌లకు కేటాయించిన ఎరువులను తీసుకోని డీలర్‌ల లైసెన్స్‌లను రద్దుచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.కౌలురైతులకు రుణఅర్హత పత్రాలను మంజూరి చేస్తూ వారికి బ్యాంక్‌లలో రుణసదుపాయం వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. బ్యాంక్‌ల ముందు రైతులకు ఇచ్చే రుణ సదుపాయం గురించిన వివరాలను ఫ్లెక్సి బోర్డుల ద్వార రైతులకు వివరించాలన్నారు. డివిజన్‌లో 144 పశువుల నీటితొట్ల నిర్మాణానికి మంజూరు ఉన్నాయన్నారు. వీటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. గృహనిర్మాణంలో ఇళ్ళు నిర్మించుకున్నవారికి బిల్లుల చెల్లింపు సత్వరమే చేయాలన్నారు. రేషన్ కార్డులలో తప్పులున్న లబ్దిదారులను గుర్తించి వారి వివరాలను ఆర్డీఓ , తహశిల్దార్ , డిఎస్‌ఓ లకు తెలియపరిచి సరిదిద్ది లబ్దిదారులకు బిల్లు చెల్లింపు జరిగేలా కృషి చేయాలనానరు. కాలుష్యనివారణ కోసం మొక్కలు పెంచాలన్నారు.మండలాల్లోన్ని ఇరిగేషన్ చెరువులు ,కుంటలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వర్షాల వల్ల కాని ఇతర కారణాల వల్ల గండ్లు పడినట్లు గుర్తించిన వెంటనే మరమ్మత్తులు చేయాలని , ఎల్లప్పుడు అధికారులు అప్రమత్తంగా వుండాలని ,ఆయన ఆదేశించారు. రచ్చబండ-2లో వచ్చాన ధరఖాస్తులను వెంటనే అప్‌లోడ్ చేయాలనీ, అర్హత లేని దరఖాస్తులను రెండోసారి విచారణ జరిపించి అర్హత దారుని గుర్తించాలన్నారు. అర్హత దారున్ని అనర్హత జాబితాలో వుంచినట్లయితే సంబంధిత అధికాలపై కఠిన చర్యలు తీపుకోవడం జరుగుతుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఓటరు గుర్తింపు కార్డుల తనిఖీ కార్యక్రమము ఈ నెల 31 లోగా పూర్తి చేయాలన్నారు. డాక్టర్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలందించాలన్నారు.గురుకులం, వసతి గృహం, కస్తూరిభాగాంధి విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భినుల ప్రసూతిలు ఎక్కువ చేయాలన్నారు.మౌళిక సదుపాయాలు లేని ఆసుపత్రులను గుర్తించి వాటిలో సౌకర్యాలు కల్పించాలని సంబందిత అధికారులను సూచించారు.హాస్టళ్ళలో వార్డెన్‌లు స్థానికంగా ఉండి విద్యార్థుల బాగోగులు చూడాలన్నారు.బాత్రూమ్‌లు, మరుగుదొడ్లు లేని పక్షంలో నివేదికలు పంపించాలన్నారు. అర్హత గల కౌలు రైతులందరికి రుణ అర్హత కార్డులను జారీ చేసి వారికి బ్యాంకు రుణం అందేలా, చర్యలు తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుగల రైతులకు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరించిన బ్యాంకు అధికారుల నుండి వ్రాతపూర్వకమైన కారణాలను తీసుకోవాలన్నారు. ఇంటింటా పారిశుద్ద్యం కింద జిల్లాలో 84648 మరుగుదోడ్లు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. అందులో 47,883 వ్యక్తిగత మరుగుదోడ్లనిర్మాణం పూర్తయిందని తెలిపారు. ప్రతి మండలంలో వ్యక్తిగత మరుగుదోడ్లు నిర్మాణం వేగవంతం చేయాలనీ , అందుకు హబిటేషన్ అధికారులు, ఫోకల్ పర్సన్స్‌లు, గ్రామైక్య సంఘాలకు విస్తృతంగా సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్గించాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి పేమెంట్స్ తక్షణమే చేయాలని ,అదేవిధంగా ఫోకల్‌పర్సన్‌లకు, గ్రామసంగాలకు,ఎమ్మార్సీలు ఇచ్చే అన్ని ఇన్సెంటివ్‌లను త్వరగా అందచేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులను, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఈ నెల 20 లోపు పంపించాలని, లేనియెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అధికారులకు హెచ్చరించారు.జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున గ్రామాలలో నీటి సంబంధ వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మురకినీరు నిలువ ఉన్నచోట కిరోసిన్ చల్లి గుంతలను మట్టితో పూడ్చాలన్నారు. మురుగుకాలువలను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ ప్రతీ రెండు మూడురోజులకు ఒక సారి చల్లాలని ఆయన అధికారులను సూచించారు. ఓ.హెచ్.యస్.ఆర్ , నీటిపంపులు, చేతి కులాయిల వద్ద నీరు నిలువకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మహాత్మాగాంధి జాతీయ ఉపాధిహామి పథకం క్రింద ఎక్కువ రోజులు పనిచేసే ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన సంబంధిత అధికారులను సూచించారు.అభివృద్ధి కార్యక్రమాల్లో మంజూరి చేయుటకు ఉమ్మడి లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని అయితే మండలాల నుండి సంబందిత శాఖలకు ప్రతిపాదనలు అందలేదని వాటిని సత్వరమే అందించాలని ఆయా మండల అధికారులకు ఆయన సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్ మాట్లాడుతూ 6వ విడుత భూపంపిణీకి సంబందించిన కిట్లు తహశిల్దార్‌లు మండలాల వారిగా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు పంపిణీ చేసిన తరువాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మీసేవా కేంద్రాలలో గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసి కార్పోరేషన్‌లో బీసిరుణాలను లబ్దిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అర్హత గల కౌలు రైతులందరికి రుణ అర్హత కార్డులను జారీ చేసి వారికి బ్యాంకు రుణం అందేలా, చర్యలు తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుగల రైతులకు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరించిన బ్యాంకు అధికారుల నుండి వ్రాతపూర్వకమైన కారణాలను తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ ఆశీర్వాదం, డిఆర్‌డిఎ పిడి రవీందర్, ద్వామా పిడి శ్రీదర్, జిల్లా పంచాయితీ అధికారి అరుణ, వ్యవసాయశాఖ జెడి ఉమామహేశ్వరీ, గృహనిర్మాణశాఖ పిడి బాల్‌రెడ్డి, మెదక్ రెవెన్యూడివిజనల్ అధికారి వనజాదేవి, జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి,బిసి,ఎస్సీ,ఎస్టీ కార్పోరేషన్ అధికారులు , ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి డాక్టర్ భాస్కర్‌రావు, ఫిషరిస్ ఎ.డి రాములు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.