ఇలాంటి సీఎం ఎక్కడా లేడు

కాసిపేట, న్యూస్‌లైన్‌: కిరణ్‌కుమార్‌రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ధ్వజమెత్తారు. కాసిపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంకు చిత్తశుద్ది, దూరదృష్టి లేకపోవడంతో దేశంలో ఏ రాష్ట్రం లేని విద్యుత్‌ సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని అన్నారు. ముందుచూపు ఉంటే నాలుగు పవర్‌ప్రాజెక్టులు నిర్మించి జెన్‌కో లాంటి సంస్థలకు ఇచ్చి ఉంటే ఇంతటి విపత్తు సంభవించేది కాదన్నారు. ఎంత విద్యుత్‌ అవసరం, ఎంత ఉంది అనే విషయమై ప్రభుత్వం సమీక్షించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వ సబ్సిడీతో విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన బడా కాంట్రాక్లర్లు విద్యుత్‌ ఇతర రాష్టాలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.

మన రాష్ట్రానికి సైతం అధిక ధరకు విక్రయిస్తున్నారంటే వాటిపై ప్రభుత్వానికి ఎంత నియంత్రణ ఉందో తెలుస్తోందన్నారు. జలవిద్యుత్‌పై అంచనాలు వేయకపోవడంతో రాష్ట్రం చీకట్లో మగ్గుతోందన్నారు. నాలుగేళ్ల కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.8.5 వేల కోట్లు అదనపు భారం వసూలు చేశారని, మళ్లీ రూ.32 వేల కోట్లు సర్‌చార్జీల పేరిట మోపేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. వెంటనే విద్యుత్‌ కోతలు ఎత్తివేసి, సర్‌చార్జీలను  రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సమస్యలపై 9 న రాష్ట్ర బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ మండల ఇన్‌చార్జి దర్ని సత్యనారాయణ, నాయకుడు దాగం మల్లేష్‌ పాల్గొన్నారు.