ఇసుక అక్రమ రావాణాను సహించేది లేదు

కలెక్టర్లదే అంతిమ నిర్ణయం

ఇరిగేషన్‌ అధికారులకు సిఎం చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి,జూన్‌23(జ‌నం సాక్షి): ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని స్పష్టం చేశారు. శనివారం ఇసుక రీచ్‌లు, ఇరిగేషన్‌ పనులపై అధికారులతో సీఎం సవిూక్ష జరిపారు. ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని, అక్రమంగా ఇసుక తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.కర్నూలు నేతలపై ఆగ్రహంకర్నూలు జిల్లా టీడీపీ నేతల తీరుపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో ప్రభుత్వం తప్పులేకపోయినా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా నేతల మధ్య విభేదాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. జిల్లా నేతల మధ్య సమన్వయం లేదని వర్లరామయ్య.. సీఎంకు నివేదిక అందజేశారు. దీనిపై దృష్టిసారించిన చంద్రబాబు.. పలు నియోజకవర్గాల్లో నేతల తీరుపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, రెండు నెలల్లో కార్యకర్తలందరి ఇళ్లకు వెళ్లేలా గ్రామదర్శని కార్యక్రమం చేపడతామన్నారు. వచ్చే వారం నుంచి ఒక్కో జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తానని చెప్పారు. మొదటి రోజు గ్రామాల్లో తిరుగుతానని, రెండో రోజు నేతలతో చర్చల్లో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. నేతలు విడివిడిగా పనులు చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాబు అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ సంక్షేమానికి నాలుగేళ్లలో రూ.40వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రతిఏటా బ్జడెట్‌లో 90శాతానికి పైగా ఖర్చు చేశామన్నారు. నెల్లూరులో తలపెట్టిన దళిత తేజం సభపై సీఎం చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నెల్లూరు సభకు ప్రతి గ్రామం నుంచి 10 మంది దళితులు తరలిరావాలని సీఎం పిలుపునిచ్చారు. దళిత తేజం ర్యాలీని, బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈనెల 27 నుంచే దళిత చైతన్య రథాలు ప్రతి జిల్లా నుంచి బయల్దేరాలని సూచించారు. 30వ తేదీలోపు నెల్లూరు నగరానికి చేరుకోవాలన్నారు.