ఇసుక కృత్రిమ సమస్య సృష్టించారు

– ఇసుకను కూడా కబ్జాచేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోంది
– పక్క రాష్టాల్ల్రో ఇసుక దొరుకుతుంటే ఇంటి దొంగలు జగన్‌కు కనిపించరా?
– ప్రభుత్వ పెద్దల స్వార్థంకోసమే ఈ సమస్య సృష్టించారు
– టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
– ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టిన బాబు
విజయవాడ, నవంబర్‌ 14 (జనంసాక్షి)  : ఇసుక సమస్య లేకపోయినా కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుకను కూడా కబ్జాచేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం విూదకు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇసుక దొరుకుతుంటే ఇంటిదొంగలు ముఖ్యమంత్రికి కనపడరా అంటూ చంద్రబాబు నిలదీశారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 35లక్ష  మంది పూటతిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, కాలంచెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవ్వరూ నష్టపోలేదన్నారు. సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలనటం అహంభావానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెపాల్సిన బాధ్యత సీఎంపై ఉందని చంద్రబాబు నాయుడు నిలదీశారు.