ఇసుక మాఫియాపై..
ఉక్కుపాదం మోపుతున్నాం
తవ్వకానికయ్యే ఖర్చుకే ఇసుకనందించాలి
జన్మభూమి కమిటీలు అధికారం చెల్లియిస్తే ఊరుకోం
మంత్రి పత్తిపాటి పుల్లారావు
ఏలూరు, జూన్23(జనం సాక్షి) : ఇసుకపై ప్రభుత్వం ఖచ్చితమైన విధానం అవలంబిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఏలూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. ఇసుకను ప్రజలకు అందించేందుకు ర్యాంపుల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించామని మంత్రి చెప్పారు. ఇసుక తవ్వడానికి అయ్యే ఖర్చుకే ఇసుకను అందించాలని తెలిపారు. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ నేతలు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జన్మభూమి కమిటీలు కేవలం సూచనలకే పరిమితమని, అధికారం చెలాయించడానికి వీలులేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తేల్చిచెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్ని ఇసుక మాఫియాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ నేతలే ఇసుక మాఫియాను దగ్గరుండి నడిపిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇసుక మాఫియాకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం టీడీపీ నేతల సమావేశంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇసుకమాఫియాలో పార్టీ నేతల జోక్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.