ఇస్తాంబుల్‌ ఏయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి

5

– 36 మంది మృతి

టర్కీ,జూన్‌ 29(జనంసాక్షి): ఇస్లామిక్‌ టెర్రరిస్టులు మరోమారు పెట్రేగి పోయారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు పేట్రేగిపోయారు. ఆసియా- యూరప్‌ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్‌ ఎయిర్‌ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్లో మరో 150 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్‌ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్‌ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు.ముగ్గురు ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపి ఆ తర్వాత వారంతట వారే పేల్చేసుకున్నారు. ఉగ్రదాడిలో 36 మంది మృతి చెందగా, 150మందికి పైగా గాయపడ్డారు. విమానాశ్రయంలో మూడు చోట్ల దుండగులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఇద్దరు సూసైడ్‌ బాంబర్లు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడం గమనించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు కాల్పులు జరిపేలోపే ఘోరం జరిగిపోయింది. మృతుల్లో టర్కీ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బంది ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్‌ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్‌ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌ ఎయిర్‌ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్‌ తైపీ ఎర్డొగాన్‌ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్‌ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిం తెలిపారు. టర్కీదాడులను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇస్తాంబుల్‌ పేలుడు నుంచి తప్పించుకున్న హృత్రిక్‌

ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన పేలుళ్లకు ముందు బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ అక్కడే ఉన్నడని సమాచారం.  ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించిన కొన్ని గంటల ముందే అటాటుర్క్‌ ఎయిర్‌పోర్ట్‌లో హృతిక్‌ తన ఇద్దరి కుమారులతో ఉన్నాడు. పిల్లలతో రిహాన్‌, హృదాన్‌తో హృతిక్‌ టర్కీ టూర్‌కు వెళ్లారు. ఘటనకు ముందు రోజు ఇస్తాంబుల్‌ నుంచి బాలీవుడ్‌ స్టార్‌ తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే తాను ఎక్కాల్సిన కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ను హృతిక్‌ మిస్సయ్యాడు. ఆ టైమ్‌లో అక్కడే అతను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాడు. మరో విమానంలో వెళ్లేందుకు హృతిక్‌కు బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు లభించలేదు. దాంతో హీరో తన పిల్లతో అక్కడే వెయిటింగ్‌ చేశారు. కానీ కొంత సమయం తర్వాత అక్కడున్న సిబ్బంది హృతిక్‌కు హెల్ప్‌ చేశారు. మరో విమానంలో ఎకానవిూ క్లాస్‌లో అక్కడున్న సిబ్బంది హృతిక్‌కు టికెట్లు ఇప్పించారు. దాంతో హృతిక్‌ తన ఇద్దరు కుమారులతో ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోయాడు. తనకు సహకరించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి హృతిక్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వల్లే తాను క్షేమంగా ఉన్నట్లు ట్వీట్‌లో తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 36 మంది మరణించగా, మరో 140 మంది గాయపడ్డారు. దీంతో హృతిక్‌ రోషన్‌ ఆయన కుమారులకు ప్రాణగండం తప్పింది. మరికొద్ది గంటలు అక్కడే ఉంటే వారి ప్రాణానికి ముప్పు ఏర్పడి ఉండేదేమో.. అని భావిస్తున్నారు.  ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపి దాదాపు 40మందిని పొట్టన బెట్టుకొని 150మంది వరకు గాయపరిచిన విషయం తెలిసిందే. అదే విమానాశ్రయంలో దాడికి కొన్ని గంటల ముందు  హృతిక్‌ రోషన్‌ తన కుమారులతో అక్కడే ఉన్నారు.  అలా వారు బయలుదేరిన కొద్ది సేపటికే విమానశ్రయంలో పేలుళ్ల ఘటన జరిగింది. ఈ సంఘటన గురించి తెలుసుకొని హృతిక్‌ ఉలిక్కిపడ్డాడు. విమాన సిబ్బంది సహాయం వల్ల తాము రెప్పపాటులో దాడి నుంచి తప్పించుకోగలిగామని చెప్పారు. తన ప్రార్థనలు ఇస్తాంబుల్‌ వైపు ఉంటాయని ట్వీట్‌ చేశారు. ‘మతం పేరిట అమాయకులను చంపేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యం నిలబడాలి’ అని హృతిక్‌ ట్వీట్‌ చేశారు.