ఈనెల 26న జరిగే జిల్లా ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి

పోసనబోయిన హుస్సేన్  హుజూర్ నగర్ నవంబర్ 23 (జనంసాక్షి) : ఈనెల 26వ తేదీన నడిగూడెం మండల కేంద్రంలో జరిగే  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో జిల్లా  మహాసభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ స్వాతంత్ర భారత దేశంలో పేద ప్రజల యొక్క మౌలిక సమస్యలను పాలకవర్గాలు ఈ 75 సంవత్సరాల  కాలంలో పరిష్కరించకపోవడంతో ఇప్పటికీ వారు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని, చేసుకోవడానికి పని, తినడానికి రెండు పూటలా సరైన తిండి, ఉండటానికి సరైన గృహ వసతి లేని పేదలు కోట్లల్లో ఉన్నారని, మరొకవైపు దేశ సంపదంతా కొద్దిమంది ధనవంతుల చేతిలో బందీగా మారుతున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు వ్యవసాయ భూమిని ఇస్తామని వాగ్దానం చేసి పాలకులు విఫలమయ్యారని అందువల్ల పేదరికం నిర్మూలించబడలేదని, ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం అట్టడుగున ఉండటానికి కారణం ఇదేనని అన్నారు. దీని స్థానంలో అనేక సంక్షేమ పథకాలను పాలకవర్గాలు తీసుకొచ్చాయని, లక్షల కోట్ల రూపాయలు ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ పేదరికం పోక పోవడానికి కారణం వారికి తెలియక కాదన్నారు. వీరి కుటుంబాలకు సరైన విద్య, అందుబాటులో మంచి వైద్యం లేకపోవడం స్వతంత్ర భారతావనికి కలవంపులేనన్నారు. అనేక దశాబ్దాలుగా వీరు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న కొద్ది గొప్పో అవకాశాలను, చట్టాలను కూడా నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దున్నేవారికి భూమి, ఉచిత విద్య, సరియైన వైద్య సౌకర్యాలు, ఉండటానికి ఇల్లు వంటి కనీస మౌలిక వసతులను కల్పించడం కోసం ఇప్పటికైనా పాలకవర్గాలు పూనుకోకపోతే వారిని కార్పొరేట్ వర్గాలు కాపాడటం వారి తరం కాదన్నారు. కులం, మతం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం ఎల్లకాలం కుదరదు అన్నారు. కార్పొరేట్లకు మేలు చేసే చట్టాలను ఇకనైనా మానేసి పేదలకు మేలు చేసే చర్యలను తీసుకోనట్లయితే ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో ఉండబోదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  తెలంగాణ  వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్. ఖాసిం, షేక్ .సైదా, బుద్ధి బాల సైదులు, గాలం వీరస్వామి, గాలం .కోటేష్, శ్రీకాంత్, బాల సైదులు, లతీఫ్, మహేష్, శ్రీకాంత్, సతీష్, నాగేశ్వరావు, బాల సైదులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.