ఈమె.. ఆమెకాదు!
జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని మోతాజ్‌ఖాన్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో 2000 సంవత్సరంలోనే డాక్టర్ అన్వర్ ఉన్నీస సాబ్రీ వైద్యాధికారిగా నియమితులయ్యారు. కానీ ఆమె స్థానంలో ఇపుడు అర్హతలేని మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అన్వర్ ఉన్నీస సాబ్రీ గుడ్‌హార్ట్ ఎన్జీఓ ద్వారా మోతాజ్‌ఖాన్ ఏరియా అర్బన్ హెల్త్ సెంటర్‌లో 2000లో నియామకమయ్యారు. కొద్ది రోజులు సేవలందించిన ఈమె , పీజీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లారు. ఆసమయంలో బీయూఎంఎస్ చేసిన మరోవైద్యురాలు ఫర్హానాను ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే ఈ పోస్టులో భర్తీ చేశారు. మూడేళ్లపాటు ఫర్హానా సేవలు అందించిన తర్వాత డాక్టర్ సాబ్రీ పీజీ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ వెంటనే తిరిగి తన పోస్టులో తాను జాయిన్ అయ్యారు. మధ్యలో కొన్నాళ్లు ఆమె రాలేదు. ఈ స్థానంలో ఆమె కూతురు డాక్టర్ అఫీసా ఎంబీబీఎస్ సాబ్రీ పేరిటనే సేవలు అందించారు. ఆ తర్వాత కొంత కాలానికి డాక్టర్ సాబ్రీ తిరిగి సేవలు అందించారు. మూడు రోజులుగా సారా అనే మరో మహిళా వైద్యురాలు సేవలు అందిస్తున్నారు. ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ బీయూ ఎమ్మెస్ పూర్తి చేసిన సారా అర్బన్ హెల్త్‌లో మెడికల్ ఆఫీసర్‌గా అనర్హురాలు. ఈ నేపథ్యంలో డాక్టర్ సాబ్రీ పేరిటనే కొనసాగించేందుకు నిశ్చయించుకున్నారు. అయితే డాక్టర్ సాబ్రీ సెలవులో ఉన్నారని, ఆమె స్థానంలో డాక్టర్ సారాను తాత్కాలికంగా కొనసాగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా ఇందులో వాస్తవం ఎంతో అధికారులే తేల్చాల్సి ఉంది. బాధ్యులు ఎవరు..?బ్యాచ్‌లర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్ చదివిన డాక్టర్ సారా వాస్తవానికి అర్బన్ హెల్త్ సెంటర్‌లో పనిచేసేందుకు అర్హురాలు కాదు. నిబంధనల ప్రకారం ఈ సెంటర్‌లో అలోపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారే ఉండాలి. కానీ గుడ్ హర్ట్ ఎన్జీఓ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ సాబ్రీకి బంధువని తెలుస్తున్న నేపథ్యంలో ఈ స్థానంలో అర్హులు, అనర్హులనే తేడాలేకుండా సెంటర్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అల్లోపతి వైద్యు సేవలు అందించే చోట యునానీ వైద్యురాలు ఏ విధంగా సేవలు అందిస్తుందనేది అధికారులే తేల్చుకోవల్సి ఉంది. యునానీ వైద్యురాలు అల్లోపతిలో మందులు ఇస్తే అవి రోగులపై చెడు ప్రభావం చూపితే బాధ్యత వహించేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘టీ మీడియా’ సందర్శనతో బట్టబయలు.. శనివారం ‘టీ మీడియా’ ఈ కేంద్రాన్ని సందర్శించినపుడు డాక్టర్ సాబ్రీ స్థానంలో డాక్టర్ సారా కనిపించారు. మీరెవరని ప్రశ్నిస్తే తన పేరు డాక్టర్నని చెప్పారు. అనుమానం వచ్చి హాజరు రిజిస్టర్ పరిశీలించగా అందులో డాక్టర్ పేరు అన్వర్ ఉన్వీస సాబ్రీ అని ఉంది. గురువారం నుంచి సంతకాలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తే అసలు విషయం అమె నోటనే చెప్పారు. డాక్టర్ సాబ్రీ సెలవులో వెళ్లారనీ, ఆమె వచ్చేంత వరకు తాను ఇక్కడ సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు. లీప్ లెటర్ గురించి ప్రశ్నిస్తే అదీ లేదు. ఈ విషయమై ‘టీ మీడియా’ మరింతా లోతుగా పరిశీలించింది. ఈ సెంటర్‌లో సేవలు అందిస్తున్న డాక్టర్ సాబ్రీకి ప్రత్యేకంగా నగరంలో ఒక ఆస్పత్రి ఉంది. ఆస్పపూతిలో బిజీగా ఉండే ఆమె విధులకు రావడం అరుదని తెలిసింది. డాక్టర్ సాబ్రీ స్థానంలో ఆమె కూతుర్ని నియమించినపుడు ఎన్టీఓ నిబంధనలు పాటించలేదు. బహిరంగ ప్రకటన ద్వారా వైద్యాధికారిని నియమించాల్సి ఉన్నా అంతా గోప్యంగా జరిగింది. ఈవిధంగానే డాక్టర్ సాబ్రీ మరో సారి ఈ సెంటర్‌కు మెడికల్ అధికారిగా నియమితులయ్యారు. ఆమె స్థానంలో అనర్హురాలైన యునానీ వైద్యురాలు కొనసాగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోక పోవడం వెనక బలమైన కారణమే కనిపిస్తోంది.జిల్లా వైద్యా ఆరోగ్య శాఖలో కీలక అధికారికి డాక్టర్ సాబ్రీ భార్యకావడంతోటే ఈ కేంద్రంలో జరుగుతున్న తతంగం వెలుగుచూడలేదని తెలుస్తోంది.