ఈ నామ్ అమలు విధానం పరిశీలన

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో అమలవుతున్న ఈ నామ్ విధానాన్ని హైదరాబాద్ రీజియన్ జాయింట్ డైరెక్టర్  ఇప్తికర్ నజీబ్ , డిప్యూటీ డైరెక్టర్ వైజె పద్మహర్ష ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఈనామ్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుందని, ఇతర వ్యవసాయ మార్కెట్ లకు ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ నామ్ విధానం ద్వారా మార్కెట్ లో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.తమ రీజియన్ పరిధిలో కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ మాట్లాడుతూ రీజనల్ డైరెక్టర్ లక్ష్మిబాయి ఆదేశాల మేరకు హైదరాబాద్ రీజియన్ జెడి, డిడి, డిఎంఓలు, సెక్రటరీలు ఈనామ్ అమలుపై అధ్యయనానికి వచ్చారని,వారికి ఈనామ్ అమలును వివరించినట్లు చెప్పారు.ఈ నామ్ అమలులో రాష్ట్రస్ధాయి అవార్డు పొందినట్లు తెలిపారు.మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు జాతీయ స్ధాయిలో ప్రధానమంత్రి అవార్డు లభించిందని వరంగల్ రీజనల్ మార్కెటింగ్ అధికారి లక్ష్మణుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కార్యదర్శి ఫసియుద్దిన్, అదనపు కార్యదర్శి పుష్పలత, గ్రేడ్ టూ కార్యదర్శి షంషీర్, డిఎంఓలు సారిక, బాలామణి, పుష్పమ్మ, స్వర్ణజిత్ సింగ్, మార్కెట్ సెక్రటరీలు చంద్రశేఖర్, శ్రీనివాస్, భాస్కర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.