ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌

ఓటుందో లేదో సరిచూసుకోండి
గుంటూరు,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఓటు గుర్తింపు కార్డు ఉన్నవారు ఒకసారి పోలింగ్‌ కేంద్రాల్లో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు. ఇదే విషయాన్ని ఆయా పార్టీలు గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తామని, ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆ రోజున పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వోలు ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉంటారని, ఓటర్లు వారి పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. వల్‌నరబుల్‌ ఓటర్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలను కలుపుతూ 427 సెక్టార్లకు సెక్టోరల్‌ అధికారులను నియమించామన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోను వల్‌నరబుల్‌ ఓటర్లను గుర్తిస్తున్నామని, రాజకీయ పార్టీలు ఎవరైనా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రజలకు  ఓటు గుర్తింపు కార్డు ఉంటే జాబితాలో ఉన్నట్లు కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లను గుర్తించామని, వారి కోసం పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్‌ రోజున ఎన్‌సీసీ వలంటీర్ల సహకారంతో వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొస్తామన్నారు. జిల్లాలో 37 వేల మంది వికలాంగ ఓటర్లున్నారని తెలిపారు.