ఉండవల్లి ఊసరవెల్లి మాటలు
తెలంగాణోళ్లు అడిగితే ఆంధ్రోళ్లు విలీనమైండ్రట
జై ఆంధ్రప్రదేశ్ పేరుతో రాజమండ్రిలో అబద్ధాల సభ
హైదరాబాద్, జనవరి 25 (జనంసాక్షి) :
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నడిబొడ్డున నిలబడి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తనలోని ఊసరవెల్లి తనాన్ని బయటపెట్టుకున్నాడు. మనిషినని మరిచి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగానే గొంతులు మార్చి అబద్ధాలు వల్లించుకుంటూ పోయాడు. ఇందుకు జై ఆంధ్రప్రదేశ్ పేరుతో నిర్వహించిన సభ వేదికగా నిలిచింది. ఆంధ్రోళ్ల అసలు రంగు అక్కడి ప్రజల సాక్షిగా బట్టబయలైంది. సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ సహా అందరూ అబద్ధాల పునాదులపై తమ ఉద్యమ వేదికను నిర్మించుకునే ప్రయత్నమే సాగించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ, తెలంగాణోళ్లు పిలిస్తేనే తాము హైదరాబాద్‌కు వచ్చామని చెప్పుకొచ్చారు. 1948లో జరిగిన సైనిక చర్యను 1956లో జరిగినట్టుగా చూపి సీమాంధ్ర ప్రాంత ప్రజల హృదయాల్లో దురుద్దేశాలు, తప్పుడు సంకేతాలు నింపే ప్రయత్నం చేశారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరుబడి కనీసం రాజధానికి భవనాలు కూడా దిక్కులేక టెంట్ల కింద ఆఫీసులు నడిపిన గతాన్ని మరిచి తామొచ్చే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని ఈ శతాబ్దపు అబద్ధం ఆడేశాడు. తామొచ్చే తెలంగాణోళ్లకు వ్యవసాయం నేర్పామంటూ భీరాలు పోయాడు. నిజాం కాలంలోనే ఇక్కడి గొలుసుకట్టు చెరువుల కింద పెద్దస్థాయిలో వ్యవసాయం జరిగిన విషయాన్ని మరుగున పడేసి ఆంధ్రోళ్లతోనే తెలంగాణ ప్రజలు అన్నీ నేర్చుకున్నారనే తప్పుడు భావన జొప్పించజూశారు. తెలంగాణకు సానుకూలంగా కేంద్రం నిర్ణయం వెలువడబోతుందన్న సమయంలో రాష్ట్ర విభజన ఆవశ్యకతపై రాజమండ్రిలో సభ పెడతానని ప్రకటించిన ఉండవల్లి కేంద్రం యూ టర్న్ తీసుకోబోతోంది అనే వార్తల నేపథ్యంలో అబద్ధాల ప్రచారాన్ని చిలువలు పలువలు చేసి వళ్లించాడు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో విషమం చిమ్మే ప్రయత్నం చేశాడు. ఈ అబాద్ధాల సభకు రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, వట్టి వసంతకుమార్, శైలజానాధ్, రఘువీరారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎంపిలు కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొని తమ అబద్ధపు వాదనలు గట్టిగానే చెప్పుకున్నారు.