ఉక్కుకై.. సడలని పట్టు 

– ఏడవ రోజుకు చేరిన రమేష్‌, రవిల నిరాహారదీక్ష
– సంఘీభావం తెలిపిన మంత్రులు
– కేంద్రం తీరుపై మండిపాటు
కడప, జూన్‌26(జ‌నం సాక్షి) : కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఎంపీ సీఎం  రమేష్‌, బిటెకట్‌ రవిలు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారంకు ఏడవ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరం వద్దకు భారీ సంఖ్యలో తెదేపా శ్రేణులు స్థానిక ప్రజలు తరలి వస్తున్నారు. ఇదిలా ఉంటే రవి, రమేష్‌లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందని వెల్లడించారు. బీటెక్‌ రవి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. దీక్ష చేస్తున్నప్పటి నుంచి బీటెక్‌ రవి 7 కిలోలు, సీఎం రమేశ్‌ 4 కిలోలు బరువు తగ్గినట్లు చెప్పారు. దీంతో వారి కుటుంబసభ్యులు, తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్షకు దిగిన టీడీపీ నేతలు సీఎం రమేష్‌, బీటెక్‌ రవిలను మంగళవారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అఖిలప్రియ, నటుడు శివాజీ పరామర్శించారు. ఉక్కు దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం విూడియాతో మాట్లాడిన వీరు.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దీక్ష ఏడు రోజులకు చేరుకుందని, సీఎం రమేష్‌, రవి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవమరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చక పోగా ఏపీ అభివృద్ధికి సహకరించడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ, వైకాపా నేతలు ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని అడగకుండా.. అహర్నిశలు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో బీజేపీ, వైకాపాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
జగన్‌ది మార్నింగ్‌, ఈవినింగ్‌ వాకింగ్‌ – మంత్రి దేవినేని ఉమ
వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర పేరుతో మార్నింగ్‌, ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. పట్టిసీమ దండగ అని అడ్డుపడ్డ జగన్‌.. గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్‌, రవి చేపట్టిన నిరాహార దీక్షా స్థలికి మంత్రి దేవినేని వచ్చారు. వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేవినేని.. కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం రానుందన్నారు. జిల్లాకు గత ఏడాది 52 టీఎంసీల నీటిని తరలించామని చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి నీటిని ఇచ్చామని తెలిపారు. ఓదార్పుయాత్రతో మభ్యపెట్టాలని చూసినా.. ప్రజలు నమ్మలేదన్నారు.
ఆంధ్రుల మనోభావాలు దెబ్బ తీయొద్దు – మంత్రి నారా లోకేష్‌
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదని ఏపీ మంత్రి నారా లోకేష్‌. వారం రోజులుగా కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమంటూ మంగళవారం ట్విట్టర్‌లో స్పందించారు. తన ట్వీట్‌లో ‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హావిూ నెరవేర్చాలి అని పార్లమెంట్‌ సభ్యుడు సీఎం రమేష్‌ గారు చేస్తున్న దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతోందని లోకేష్‌ తెలిపారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హావిూల అమలు కోసం ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుంది అన్నారు.
—————————————