ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ ఉద్యమం ఆపను
అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం
ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుకుంటుంది
రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్
జడ్పీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్ష
కడప, జూన్20(జనం సాక్షి ) : కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పష్టంచేశారు. ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఉక్కుకర్మాగారం స్థాపన కోసం ఎమ్మెల్సీ బీటెక్‌రవితో కలిసి జడ్పీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమ సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినా.. ప్రతిపక్ష నేత జగన్ ఒక్కమాటా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. దీక్ష చేస్తోన్న నేతలకు సంఘీభావంగా తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో దీక్ష స్థలికి తరలివచ్చారు. అంతకుముందు సీఎం రమేశ్ కడప నగరంలోని మహాత్మా గాంధీ, ఎన్టీ రామారావు, అంబేడ్కర్, కోటిరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉక్కు కర్మాగారం కోసం 350 రోజుల నుంచి ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మిస్తామంటూ చెప్పి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు.