ఉత్తమ పంచాయితీలుగా తీర్చిదిద్దుతున్నాం.
– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ అక్టోబర్ 19(జనం సాక్షి):జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అన్ని రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శాఖలచే కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు.మంగళవారం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్, సుల్తానియా సంచాలకులు హనుమంతరావు, గ్రామ పంచాయతీల అభివృద్ధి నిర్వహణ పనితీరుపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదిస్తూ జిల్లాలోని గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీ లుగా సంబంధిత శాఖల వారీగా అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.ముందుగా 54 గ్రామపంచాయతీలు తీసుకొని సమర్ధవంతంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి నాలుగుసార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన పరచడం జరిగిందన్నారు. అంచలంచలుగా జిల్లాలోని 281 గ్రామపంచాయతీలలో 113 అంశాలపై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు , తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షడ్స్ నిర్వహణ, పారిశుద్యం మెరుగు పరుస్తూ గ్రామాలలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నామన్నారు. వాస్తవ నివేదికల కొరకు జవాబు దారీతనంతో పారదర్శకంగా పనులు చేపడుతూ ప్రజలకు అవగాహన పరుస్తున్నామని అన్నారు. ఈ టేలి కాన్ఫెరెన్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పి సి.ఈ.ఓ.వసంత, డి.ఆర్.డి.ఓ.రాంరెడ్డి, డి.పి.ఓ.రంగాచారి తదితరులు పాల్గొన్నారు.