ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

పశ్చిమ్‌బంగా నుంచి దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి
విశాఖపట్నం, జూన్‌13(జ‌నం సాక్షి) : పశ్చిమ్‌బంగా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ తీరం వెంబడి ఉపరితల ద్రోణి అవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భూభాగం నుంచి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర తీరప్రాంతంలో సముద్ర గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని.. ఈ కారణంగా అలల ఎత్తు కూడా పెరిగిందని సునావిూ హెచ్చరికల సంస్థ స్పష్టం చేసింది. సముద్రపు అలల ఎత్తు 3.5 విూటర్ల నుంచి 4.1 విూటరు ఎత్తున ఎగసి పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. నెల్లూరులోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ వరకూ ఈ పరిస్థితి ఉందని ఇన్‌ కాయిస్‌ స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షం పతుడుటం, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు చల్లటి వాతావరణంలో సేద తీరుతున్నారు.