ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
రావత్ బలపరీక్ష రద్దు
ఆర్టికల్ 356 ఎందుకు ఉపయోగించారు
కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన సుప్రీం
న్యూఢిల్లీ,ఏప్రిల్27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగు తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నెల 29న రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ లేదని కోర్టు స్పష్టం చేసింది. విచారణలో కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం ఏడు ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే కొనసాగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.దీంతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు పొడిగించినట్లయ్యింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. కాగా రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్‌కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.