ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం

– ఐదు రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ గాలిదుమారం
– రాజస్థానంలో ఇసుక తుఫాన్‌
– కూలిపడ్డ భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు
– ఐదు రాష్ట్రాల్లో 68మంది మృతి
– 100మందికిపైగా గాయాలు
– సహాయక చర్యలుముమ్మరం చేసిన ప్రభుత్వాలు
న్యూఢిల్లీ, మే3(జ‌నం సాక్షి) : ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలపై ఈ గాలివాన ప్రభావం తీవ్రంగా పడింది. ఉత్తర భారతంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు. బలమైన గాలులు, వర్షం ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం కూలిపోయాయి. ఇళ్లు, రోడ్లు ధ్వంసమ్యాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు 42 మంది చనిపోయారు. అందులో ఆగ్రాలోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. బిజ్నోర్‌లో ముగ్గురు, షహ్రాన్‌పూర్‌లో ఇద్దరు, బరేలీలో ఒక్కరు చనిపోయినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. చాలా మంది గాయపడ్డారు. తక్షణమే నాలుగు జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రాజస్థాన్‌లో బలమైన గాలులు, దుమ్ముతో కూడిన తుపాను ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈదురు గాలులు, దుమ్ముతో కూడిన తుపాను మొదలై రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది. భరత్‌పూర్‌ జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ధోల్‌పూర్‌లో ఆరుగురు చనిపోయారు. అల్వార్లో నలుగురు, ఝున్‌ఝున్‌, బికనేర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాజస్థాన్‌లో గాలివాన ధాటికి ఇళ్లు కూలిపోవడం వల్ల చాలా మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోనూ భారీవర్షం కురిసింది. కుమావోన్‌ ప్రాంతంలో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల ధాటికి అక్కడ కొనసాగుతున్న ఛార్‌ ధామ్‌ యాత్రకు అంతరాయం కలిగింది.
రహదారులపై కొండచరియలు విరిగిపడడంతో వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బద్రీనాథ్‌ హైవేపై కొండచరియల కూలడం వల్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పంజాబ్‌, హరియాణాల్లోనూ బుధవారం రాత్రి ఈదురుగాలులు, దుమ్ముతో కూడిన తుపాను సంభవించింది. పలు చోట్ల వర్షాలు కురిశాయి. రాజధాని నగరం ఢిల్లీలో కూడా భారీవర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 15 విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు.
——————————————-