ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, జనవరి 28 (): రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఐకాస నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రం ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా తెలంగాణను ఏర్పాటు చేస్తామని షిండే ప్రకటించి మాట తప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరదీక్షకు హాజరయ్యేందుకు వెళ్తున్న తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసేవిధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాల్సిన కాంగ్రెస్‌ నాయకులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఇక నుండి కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని ప్రజలు దీనిని సహించరని, తగిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం తప్పదని వారు అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా ఐకాస ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారంనాటికి 1121 రోజుకు చేరుకున్నాయి. సమరదీక్షకు మద్దతుగా భారీ సంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు.