ఉద్యమం నిలిచింది టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది

పరకాల ఫలితం తెలంగాణ ప్రజా చైతన్య వాదాన్ని నిలిపింది. ఇది ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.అయితే కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉప ఎన్నికల ఫలితాలపై తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించడం ద్వారా అక్కడి ఓటర్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇక్కడ సాధించిన మెజారిటీ స్వల్పమే అయినప్పటికీ దాన్ని తక్కువ చూపించే ప్రయత్నం సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ తగ్గినందున తెలంగాణవాదం బలహీనపడిందని సీమాంధ్రకు చెందిన లగడపాటి రాజగోపాల్‌ కొత్త భాష్యం చెప్పారు.అదే రాజగోపాల్‌ సీమాంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కట్టుబడకపోవడం గమనార్హం. ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని రాజగోపాల్‌ ప్రచారం నిర్వహించిన విషయం ఇక్కడ ప్రస్తానార్హం. రాజగోపాల్‌ మాటల్లో చెప్పాలంటే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందున సీమాంధ్రులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలమని సంకేతాలిచ్చారు. ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ విషయంలో సానుకూల నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
ఉప ఎన్నికల ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. ఏ ప్రాంతం ప్రజలు ఎటువైపో తేలిపోయింది. ఇక తేలాల్సింది తెలంగాణే. ఇందుకోసం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. భేషజాలకు పోకుండా అన్ని పార్టీలు,జేఏసీలు, వివిధ సంఘాలు సమన్వయంతో ముందుకు సాగాలి. ఇప్పటికీ సాచివేత, దాటవేత వైఖరి అవలంబించే కేంద్రం ఒత్తిడి పెంచి మెడలు వంచాలి. ఇందు కోసం పటిష్టమైన ఉద్య ప్రణాళికను రూపొందించుకోవాలి. అవసరమైతే 2009 తరహాలో మిలిటెంట్‌ పోరాటాలూ చేపట్టాలి. 2014 వరకూ వేచిచూడకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఇంకా జాప్యం చేస్తే సార్వత్రిక ఎన్నికల్లోనూ పరకాల ఫలితమే పునరావృతం కాక తప్పదు.

తాజావార్తలు