ఉద్యమాన్ని అణచివేస్తే మావోయిస్టులు ఉద్భవిస్తారు
మందమర్రి, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఉద్యమం రూపంలో మావోయిస్టులు ఉద్భవిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్రం ప్రజల ఆకాంక్ష అన్నారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని, అందుకే నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లో పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తామనే అంశం ఎన్నికల మెనిఫెస్టోలో ఉందన్నారు.
ఎన్నికల వేళ సీఎం విద్యుత్ చార్జీలు పెంచడం ఆయన కుట్రలో భాగమేనని, చార్జీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగడపాటి నియోజకవర్గస్థాయి నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత నేతలంతా ఏకతాటిపైకొస్తే రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. నీటి ఎద్దడి నివారణకు మందమర్రి మున్సిపాలిటీకి రూ.17 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా కృషిచేస్తానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.