ఉద్యమ స్పూర్తిలో తెలంగాణ అభివృద్ధి

5

– అంకాపూర్‌, ముల్కనూర్‌, గంగదేవపల్లి ఆదర్శం

– గ్రామజ్యోతి సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో మార్పు సాధించాలన్నారు. తాగునీరు కూడా లేని సింగపూర్‌ ప్రపంచాన్నే శాసించే స్థితిలో ఉందని ఆ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని  ముఖ్యమంత్రిపిలుపునిచ్చారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..  అందుకు గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. పంచాతీయరాజ్‌ వ్యవస్థకు గంగదేవపల్లి, అంకాపూర్‌ ప్రతిబింబాలని, సహకార వ్యవస్థకు కరీంనగర్‌ జిల్లా ముల్కనూరు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.జిల్లా అధికారులు ఒక్కో మండలానికి ప్రతినిధిలా వ్యవహరించాలని సూచించారు. ఐదేళ్ల కోసం గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించి, సభలు నిర్వహించడం ద్వారా కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజల సంఘటిత శక్తి తోడైతేనే ప్రగతి సాధ్యమని పునరుద్ఘాటించారు. బాగా పనిచేసిన గ్రామాలకు అవార్డుల ఇవ్వాలని, గ్రామజ్యోతి తరహాలో పట్టణజ్యోతి కార్యక్రమాన్ని చేపడతామని కేసీఆర్‌ అధికారులతో అన్నారు. ప్రజలు తలచుకుంటే చేయలేనిది లేదని అన్నారు. అయితే వారిలో ఉన్న సంఘటిత శక్తిని పట్టుకోవాలన్నారు. వారిందరిని గ్రామాల అభివృద్దిలో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి గ్రామానికి భిన్నమైన సమస్యలు ఉంటాయని, అందువల్ల ఆయా గ్రామాలకు భిన్నంగానే ప్రణాళిక ఉండాలన్నారు. ఒకచోట మంచినీటి సమస్య, మరోచోట సాగునీటి సమస్య, మరోచోట మరో సమస్య ఉంటుందన్నారు. అలాంటి వాటిని గుర్తించాలన్నారు. తండాలు, వాడల నుంచి మార్పు చుట్టాలన్నారు. ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రయోజనకారిగానే ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా వేలకోట్లు ఖర్చవుతున్నా గ్రామాల్లో ఆస్తులు కనపడడం లేదన్నారు. గ్రామాల ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు దూరం కావాలని సిఎం అన్నారు.  గోదావరి పుష్కరాలను కలెక్టర్‌ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు సంఘటితంగా విజయవంతంగా నిర్వహించారని కెసిఆర్‌ అన్నారు. అందుకు వారిని అబినందిస్తూ ఇదే గ్రామాల అభివృద్దికి ప్రేరణ కావాలన్నారు. గ్రామాలను ఆరోగ్యప్రదేశాలుగా రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరి, పోచారాం శ్రీనివసారెడ్డి, కెటిఆర్‌ తదితరులు పాల్గొన్నారు.   గ్రామజ్యోతి కార్యక్రమం రూపకల్పనపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  సమావేశమయ్యారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామజ్యోతి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో పాటు ఉన్నతాధికారులు, ఐటీడీఏ పీవోలు పాల్గొన్నారు. గ్రావిూణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ఆగస్టు 15 నుంచి తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో గ్రామసభలకు అధికారాలతో పాటు గ్రామ పంచాయతీలపై జవాబుదారీతనం, బాధ్యతలను మోపుతూ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించనున్నారు. గ్రామాలే ప్రణాళిక రూపొందించుకుంటే అందుకు ప్రభుత్వం నిధులు అందచేస్తుంది.