ఉద్యోగానికి అంగవైకల్యం అడ్డు కాదు
\
దివ్యాంగులుమహిళల జాబ్ మేళా ప్రారంభించిన బుర్రా వెంకటేశం, ఐఎఎ స్ సకలాంగుల కంటే దివ్యాంగులు ఎంతో నిజాయితీగా, పట్టుదలగా పనిచేస్తారని తెలంగాణ రాష్ట్ర బిసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు అన్నారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ కాలేజీలో దివ్యాంగుల కోసం ట్రైన్ ( ట్రస్ట్ ఫర్ రిటైలర్ అండ్ రిటైల్ అసోసియే షన్ అఫ్ ఇండియా )(TRRAIN) & రైస్(రురల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(RICE), హాజరీ గ్రూప్ స్వఛ్చంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. . మంచి సమాజాన్ని నిర్మించడానికి అందరూ కలిసి పనిచేయాలని, శారీరక లోపాలు ఉన్న వారిని హేళన చేయకుండా వారికి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను కలెక్టర్ గా పనిచేసిన జిల్లాల్లో దివ్యాంగులకు ఉద్యోగాలు ఇచ్చామని, ఇతరుల కంటే వారు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఏ శారీరక లోపం లేని వారు అవినీతికి పాల్పడుతూ సమాజం తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు, సంస్థలు దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వారు ఆశించిన గమ్యాన్ని త్వరగా చేరుకుంటారని ఎందరో ఉద్యోగులు రుజువు చేశారని ఆయన అన్నారు. సకలాంగుల కంటే దివ్యాంగులు ఎంతో చురుగ్గా ఆలోచిస్తారని, తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తారని వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం అందరి బాధ్యత అని బుర్రా వెంకటేశం గారు సూచించారు. దివ్యాంగుల మరియు మహిళలకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో నిర్వహించి తద్వారా వికలాంగులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. ట్రైన్, రైస్ , హజారీ గ్రూప్స్ సంస్థలు చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ జాబ్ మేళా ద్వారా 800 నుండి 1000 మందికి ఉపాధి కలిగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. . వికలాంగులకు అనువైన ఉద్యోగాల అవకాశాలు కల్పనలో ఈ సంస్థలు చేస్తున్న సేవ ఎంతో ఉత్తమమైనది అని ప్రశంసించారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పి డబ్ల్యూడి డిపార్ట్ మెంట్ కమిషనర్శైబి. శైలజా గారు అన్నారు. ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ దివ్యాంగ యువత వినియోగించుకుని, తమ సత్తా చాటుకోవాలని సూచించారు. ట్రైన్ ( ట్రస్ట్ ఫర్ రి ట్రైలర్ అండ్ రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా )(TRRAIN) & రైస్(రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(RICE), హాజరీ గ్రూప్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ దివ్యాంగులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి గారు, అధ్యాపకురాలు ఉదయశ్రీ గారు, ట్రైన్ సంస్థ సౌత్ ఇండియా హెడ్ సురేష్ గారు, రైస్ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మొగుళ్ళ అమరేందర్ గౌడ్, హజారి సంస్థ హెడ్ ప్రవీణ్ , కాలేజీ అధ్యాపకులు, NSS యూనిట్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కాలేజీ ఆవరణలో బుర్రా వెంకటేశం గారు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్య నేర్చుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.