ఉద్యోగాల భర్తీకి విధివిధానాలు
– గ్రూపు-1 ప్రశ్నాపత్రంలో తెలంగాణ ఉద్యమం
– టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్,జులై29(జనంసాక్షి):
రాష్ట్రంలో భర్తీచేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ 1లో ఆరో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే అంశాన్ని చేర్చారు. గ్రూప్-1, గ్రూప్-2లో అదనంగా 6వ పేపర్ చేర్చారు. ఈ 6వ పేపర్‌లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలను టీఎస్‌పీఎస్సీ చేర్చింది. గ్రూప్ 1 కింద డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో సహా 20 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2 కింద పురపాలక కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ సహా 12 రకాల పోస్టులు, గ్రూప్ 3 కింద 17 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా గ్రూప్-2బి స్థానంలో గ్రూప్-3ను రూపొందించారు. గ్రూప్-1 పరీక్షలోని వెయ్యి మార్కులకు గాను, రాత పరీక్షకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. గ్రూప్-2 పరీక్షలోని 675 మార్కులకు గాను రాత పరీక్షకు 600 మార్కులు,ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి పచ్చజెండా రావటంతో ఉద్యోగ ప్రకటనల జారీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధమవుతోంది. సోమవారం 3783 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందే మరో 543 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చేశాయి. వ్యవయసాయ, నీటిపారుదల-ఆయకట్టు అభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్-గ్రావిూణాభివృద్ధి, రెవెన్యూ, రహదారులు-భవనాల శాఖలు తమ తమ విభాగాల్లోని ఉద్యోగాల వివరాలను టీఎస్‌పీఎస్సీకి ఎంత త్వరగా అందిస్తే అంత త్వరగా ఉద్యోగ ప్రకటనలు వెలువడతాయి. ఆయా పోస్టుల అర్హతలతో పాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్ల వివరాలనూ ఆయా శాఖలే తెలియజేయాల్సి ఉంటుంది. శాఖల వారీగా కాకుండా పోస్టుల వారీగా ఉద్యోగ ప్రకటన, పరీక్షలుంటాయి.ఈ ఏడాదే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మరో పదివేల పోస్టుల్లో సాధారణ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అనేది కీలకం.