ఉద్యోగులను విభజించండి
హైదరాబాద్,ఆగస్ట్6(జనంసాక్షి):
రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఉద్యోగులను విభజించకపోవడంపై టిఆర్‌ఎస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు. ఉద్యోగుల విభజన కమిటీలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీ కవిత తెలిపారు. సత్వరమే ఉద్యోగుల విభజన సమస్యని పరిష్కరించాలని కోరినమని వెల్లడించారు. కమల్ నాథన్ కమిటీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రాజ్ నాథ్ కు వివరించినమని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని.. ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు తెలంగాణ ఉద్యోగులకే చెందుతాయని కవిత భరోసా ఇచ్చారు. తెలంగాణ బిడ్డల్ని తమ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తమకు అన్యాయమే జరుగుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా కీలక ఉద్యోగాల్లో ఆంధ్రావారే ఉన్నారని వారు గుర్తుచేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగులతోపాటు జిల్లా, మండల స్థాయి ఉద్యోగుల విభజన చేయాలని కేంద్ర ¬ంమంత్రిని కోరినమన్నారు. తెలంగాణ ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేయడం లేదని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరపాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు.