ఉన్న చూపు పోయింది
– సరోజిని కంటి ఆసుపత్రి నిర్వాకం
– 13 మందికి అంధత్వం
– బాధ్యులపై చర్యలు తప్పవు
– మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్,జులై 6(జనంసాక్షి):హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దారుణమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం 13 మందికి శాపంగా మారింది. కంటిని శుభ్రం చేసే మందు కాలం చెల్లినది వాడిన కారణంగా దాదాపు 13 మంది చూపు కోల్పోయారు. దీంతో ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించాయి. 13 మంది రోగులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో బాధిత రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ చూపు రాలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గత వారం వైద్యులు 13 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్‌కు ముందు కళ్లలో కాలం చెల్లిన ద్రవం వేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రాజేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఆపరేషన్ సమయంలో 13 మంది రోగులకు ఇబ్బంది కలిగిందన్నారు. కళ్లను శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా గుర్తించామని తెలిపారు. బ్యాక్టీరియా ఉన్న ద్రవంతో కళ్లు శుభ్రం చేయడం వల్ల రోగులపై ప్రభావం పడిందన్నారు. సెలైన్ బాటిళ్లు వెనక్కి పంపడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున డ్రగ్స్ అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారని చెప్పారు. సెలైన్ బాటిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీపై చర్యల బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. రోగులకు చూపు తెప్పించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో వారం రోజుల పాటు ఆపరేషన్లు చేయడం లేదని స్పష్టం చేశారు.
‘కళ్ల’ బాధ్యులపై కఠిన చర్యలు
హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో కేటరాక్ట్ ఆపరేషన్ తర్వాత చూపు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అన్నిరకాలుగా వైద్యసహాయం అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శించిన ఆయన, ఆస్పత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ చేసిన కళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించిన లిక్విడ్ లో బ్యాక్టీరియా ఉన్నట్టు తేలిందని, దాని వల్లనే ఇన్ ఫెక్షన్ సోకిందని మంత్రి చెప్పారు. బాధితుల్లో ఇప్పటికే ఐదుగురికి ఇన్ ఫెక్షన్ తగ్గిందని.. మరో ఏడుగురికి వైద్యం చేస్తున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారి కోసం అవసరమైతే బయట నుంచి నిపుణులను రప్పిస్తామని భరోసా ఇచ్చారు.కళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించిన లిక్విడ్ ను సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ ఘటనపై రెండు కమిటీలు వేశామని, బాధ్యులుగా తేలిన వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.కళ్లకు సంబంధించిన అన్నిరకాల వైద్యం, ఆపరేషన్లు చేయడంలో సరోజిని దేవి కంటి ఆస్పత్రికి మంచి పేరుందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ ఆస్పత్రిలో నెలకు 1200 మందికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారని వివరించారు.