ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలి విదేశీ పర్యటన

నేటినుంచి వారంపాటు పెరూ తదితర దేశాల యాత్ర 
న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ): ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తొలిసారి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వివిధ దేశాల్లో ఆయన పర్యటించి ద్వైపాక్షిక బంధాలపై చర్చించినున్నారు. ఆదివారం నుంచి వారం రోజులపాటు ఆయన లాటిన్‌ అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్వాటెమాలా, పనామా, పెరు దేశాల్లో రాజకీయ సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం పరస్పర ప్రయోజనాల పెంపుపై ఆయా దేశాల ఉన్నతస్థాయి నేతలతో ఆయన చర్చించనున్నారు. తొమ్మిది నెలల కిందట ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన వెంకయ్యనాయుడుకు తొలి విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఆయా దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులతో సుమారు 25 సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రవాస భారతీయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్థానిక చారిత్రక ప్రాంతాలు సందర్శించనున్నారు. పెరుతో దౌత్య సంబంధాలు ప్రారంభమై 55 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. పెరు దేశంలో చివరిసారిగా 1998లో నాటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌, 2013లో నాటి ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీలు సందర్శించారు. ఆయనతో పాటు గిరిజన వ్యవహారాల సహాయమంత్రి జశ్వంత్‌సింగ్‌ సుమన్‌భాయ్‌, ఎంపీలు తిరుచ్చిశివ, అనిల్‌ దేశాయ్‌, ఛాయవర్మ, కమలేశ్‌ పాసవాన్‌, ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు పర్యటించనున్నారు.