ఉపాధి కల్పించారు.. కూలి డబ్బులు మరిచారు.
– ఆరు నెలలు దాటిన అందని కూలీ డబ్బులు.
– పండగపూటైనా కూలి డబ్బులు అందేనా..?
– కూలి డబ్బుల కోసం అధికారులకు ప్రజాప్రతియులకు విన్నపించాం.
– కూలి డబ్బులు రాలేదంటూ ఉపాధి కూలీల రోదన.
ఊరుకొండ, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):
గత ఆరు నెలలుగా ఎండనకా.. వాననక పొద్దంత కష్టపడి పని చేస్తే.. ఉపాధి కూలీల డబ్బులు ఇప్పటివరకు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని దీనస్థితిలో ఉన్న ఉపాధి కూలీలకు గత ఆరు నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు అందకపోవడంతో.. కనీసం దసరా పండుగ కైనా తమకు కూలి డబ్బులు అందుతాయో లేదోనన్న అయోమయ పరిస్థితిలో ఉన్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూలి డబ్బులు రావడం లేదు సారూ.. అంటూ స్థానిక తహసిల్దార్ కు, ఎంపీడీవోకు మరియు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే చర్ల కోల లక్ష్మారెడ్డికి సైతం వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి స్పందన కానరాలేదని వారు రోధిస్తున్న. మీ ఇంట్లో తినండి.. మా ఇంట్లో పని చేయండి.. అన్న చందంగా ఉపాధి కూలీ పనులు కొనసాగుతున్నాయని, ఉపాధి కూలీ కల్పించారు.. ఉపాధి కూలీ డబ్బులు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఊరుకొండ మండలంలోని మాదారం గ్రామ ఉపాధి కూలీలు లబో దిబో మంటున్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఆరు నెలలుగా ఉపాధి కూలీ పనుల్లో వెట్టీ చాకిరీ చేయించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు కూలి డబ్బులు చెల్లించడం మాత్రం మర్చిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక పంచాయతీ కార్యదర్శిని మరియు ఎంపీడీవో ప్రభాకర్ ను వివరణ కోరగా.. ఉపాధి కూలీ డబ్బులు మంజూరు అయ్యాయని.. ట్రాన్సాక్షన్ విషయంలో ఏదో లోపం జరిగిందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఉపాధి కూలీల ఖాతాల్లోకి కూలి డబ్బులు జమ అయ్యేలా చూస్తామన్నారు. మాధారం గ్రామానికి చెందిన సీనియర్ మేట్లు జగదీష్, బీఎస్పీ మండల కన్వీనర్ అంకురి హరీష్ లు ఉపాధి కూలీ డబ్బుల విషయమై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడగా ఆరు లక్షలు మంజూరు అయ్యాయని.. పోస్ట్ ఆఫీస్ నుండి బ్యాంకు అకౌంట్ లలోకి ట్రాన్సాక్షన్ జరిగే విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడిందని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నరధికారి స్పందించి ఆరు నెలలుగా కూలీ డబ్బులు అందని మాదారం గ్రామ ఉపాధి కూలీలకు సత్వరమే కూలీ డబ్బులు అందేలా చూడాలని మండల బిఎస్పి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని దుస్థితి మాది..
– అంకూరి లక్ష్మమ్మ, ఉపాధి కూలీ, మాదారం.
గత ఆరు నెలలుగా ఉపాధి హామీ పనుల్లో పొద్దంతా కష్టపడి పనిచేస్తే ఇప్పటివరకు కూలీ డబ్బులు రాలేదు. పూట గడవడం కష్టంగా ఉంది. మా కూలి డబ్బులు మాకు అందేలా చూడండి.
దసరా పండుగ కైనా కూలి డబ్బులు వచ్చేలా చూడండి సారూ..
– కాళ్ళ ఈశ్వరమ్మ, ఉపాధి కూలి, మాదారం.
ఉపాధి పనులు గత ఆరు నెలలుగా చేస్తూ వచ్చాం. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాకు అందలేదు. కనీసం దసరా పండుగకు అయిన ఉపాధి కూలీ డబ్బులు వచ్చేలా చూడండి సారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి పని చేయమన్నారు.. కూలీ డబ్బులు ఇవ్వడం మరిచారు.
– ఇంద్రకంటి బాలమ్మ, ఉపాధి కూలి, మాదారం.
గత ఆరు నెలలుగా ఉపాధి హామీ పనుల్లో తమతో వెట్టి చాకిరి చేయించి కూలి డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చెమటోర్చి చేసిన కూలి పనికి త్వరగా కూలీ డబ్బులు వచ్చేలా చూడండి.