ఉపాధి లక్ష్యంగా పరిశ్రమలు

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు చర్యలు
నల్లగొండ,అక్టోబర్‌5 (జనంసాక్షి): ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనకబడిన చౌటుప్పల్‌, మర్రిగూడ, నారాయణపురం, మునుగోడు ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలు సుమారు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేయి ఎకరాల్లో టీఎస్‌ఐఐసీ ఈ పరిశ్రమలకు అంకురార్పణ చేస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమలను తెలంగాణ పరిశ్రమల సమాఖ్య టిఫ్‌ కు అప్పగించి వారద్వారా అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలనేది ప్రణాళిక. ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత టిఫ్‌లో ఉన్న పారిశ్రామిక వేత్తలే ఈ పార్కులను నిర్వహించనున్నారు.  వచ్చే ఏడాది తొలినాళ్లలో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధించే కార్యాచరణతో ముందుకు పోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించే పక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌- భువనగరి-వరంగల్‌ జాతీయరహదారిని పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించిన ప్రభుత్వం.. త్వరలోనే భువనగిరి-చౌటుప్పల్‌ల విూదుగా నిర్మించబోయే అవుటర్‌ రహదారి లోపలి భాగాన్ని పరిశ్రమలకు అడ్డాగా మార్చనుంది.చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో దాదాపు వేయి ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయాలని ఇటీవలే సర్కారు నిర్ణయించడంతో దానికి కావాల్సిన భూ సేకరణ పక్రియ వడివడిగా సాగుతోంది. నగరానికి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి ఈ ప్రాంతం గుండానే పోతుండటం, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దగ్గరలోనే ఉండటం తో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కును దాదాపు వేయి ఎకరాల్లో నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పార్కు, అలాగే  ఫర్నిచర్‌, పెద్ద తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేయి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న పరిశ్రమలన్నీ పర్యావరణరహితంగానే ఉండేట్లు చూసుకోవాలని పరిశ్రమల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా పరిశ్రమల వల్ల విపరీతమైన కాలుష్యం చెలరేగి ప్రజలు పలు రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రానున్న పరిశ్రమలు పూర్తిగా కాలుష్య రహితంలనే ఆహ్వానించాలని సూతప్రాయంగా నిర్ణయించారు. కాలుష్య కారక పరిశ్రమలను జనావాసాలకు దూరంగా నిర్మించాలనే నిబంధనల ప్రకారమే కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ భూసేకరణ పక్రియను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని టీఎస్‌ఐఐసీ ఆలోచిస్తోంది. ఈ ప్రాంతమంతా పరిశ్రమలను ఏర్పాటు చేసి జాతీయ రహదారిని మొత్తం పారిశ్రామిక హబ్‌గా మార్చాలని సర్కారు భావిస్తోంది.

తాజావార్తలు