ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్ కుడా పాటించాల్సిందే
జనంసాక్షి, కరీంనగర్: వయసును తగ్గించేలా కనిపించే మోడ్రన్ డ్రెస్సులను ఉపాధ్యాయులు ఇక అల్మారాలో తగిలించుకోవాల్సిందే. పాఠశాల్లో ఇప్పటివరకు పిల్లలకే డ్రెస్‌కోడ్ పరిమితమైంది. ఇప్పుడు ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్ పాటించాల్సిందే. జీన్స్‌ఫ్యాంట్లు , ఎనిమిది జేబుల ఫ్యాంట్లు , కాలర్ టీషర్టులు, రౌండ్ నెక్ టీషర్టులు, రంగురంగుల బూట్లు, చెప్పులు ధరించి పాఠశాలకు వెళ్లవద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బోధన సమయాల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు చదువుపై వారి శ్రద్ద తగ్గుతుందని పేర్కొంది. గౌరవప్రదమైన బోధన వృత్తి నిర్వహించేవారు ఆదేశించింది. బోధన సమయంలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతినడంతోపాటు చదువుపై వారి శ్రద్ధ తగ్గుతుందని పేర్కొంది. గౌరవప్రదమైన బోధన వృతి నిర్వహించేవారు ఆ మేరకు హోదాను నిలబెట్టేలా దుస్తులు ధరించాలని సూచించింది. నడవడికలోనూ ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా కనిపించే దుస్తులు వేసుకుని పాఠశాలకు వెళ్లాలని పేర్కొంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేషధారణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. భావిపౌరులను తయారు చేయాల్సిన ఉపాధ్యాయులు వేషధారణలోనూ ఆదర్శంగా ఉంటేనే వీరి బోధనలను పిల్లలు పూర్తిగా స్వీకరిస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అసలు కారణం మాత్రం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పిల్లల విషయంలో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. కొందరు ఉపాధ్యాయుల అనైతిక ప్రవర్తన వల్ల మొత్తం విద్యా వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతోంది. ముఖ్యంగా విద్యార్థినుల విషయంలో కొందరు ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు వీరి పట్ల గౌరవాన్ని పోగొట్టుతోంది. ఇలాంటి పలు సంఘటనలు మన జిల్లాలోనే ఇటీవల ఎక్కువగానే చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు ఉపాధ్యాయులపై ఏకంగా భౌతికదాడులకు దిగిన సంఘటనలు ఉన్నాయి. వీటిని నివారిస్తేనే ఉపాధ్యాయులపై, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ
భావించింది. దీనికోసం పలు చర్యలు మొదలుపెట్టింది. మొదటగా ఉపాధ్యాయులకు డ్రెస్‌కోడ్ నిబంధనలు అమల్లోకి తెచ్చింది.