ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమబాట
నిజామాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న కేజీటు పీజీ విద్యకు సంబంధించి ఈ ఏడాది కూడా అతీగతీ లేదని పీఆర్‌టీయూ జిల్లా నాయకులుఅన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తామే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ తరగతులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ పాఠశాలల దోపిడీ పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకీకృతసర్వీసురూల్స్, కేజీటుపీజీ, హెల్త్‌కార్డుల జారీలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. హెల్త్‌కార్డుల జారీలోజాప్యం కారణంగా ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. సీపీఎస్‌విధానరద్దుపైనా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై త్వరలో అన్ని సంఘాలతో కలసి ఉద్యమబాట పట్టనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడితే తమ సమస్యలన్నీ తీరుతాయని, అందుకు తగ్గట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హావిూలిచ్చారని గుర్తుచేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఏళ్లుగా పరిష్కారం కాని ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించి రాష్ట్రపతిభవన్‌కు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంఈవో, పీజీహెచ్‌ఎం పోస్టులను నేరుగా భర్తీచేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. పాతపద్ధతిలోనే పదోన్నతుల ద్వారా ఆయా పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోతే ఐక్యఉద్యమాలకు శ్రీకారంచుట్టి తెలంగాణ ఉద్యమం మాదిరి ఉపాధ్యాయ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.